కార్గిల్ వీరుడికి కీలక బాధ్యతలు

  • Published By: vamsi ,Published On : March 1, 2019 / 12:12 PM IST
కార్గిల్ వీరుడికి కీలక బాధ్యతలు

ఇండియా, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఐఏఎఫ్‌ వెస్ట్రన్‌ ఎయిర్‌ కమాండ్‌(WAC) కు ఛీఫ్ గా ఎయిర్‌ మార్షల్‌ రఘునాథ్‌ నంబియార్ ను నియమిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈస్ట్రన్‌ ఎయిర్‌ కమాండ్‌ చీఫ్‌గా పనిచేసిన నంబియార్‌  వెస్ట్రన్‌ ఎయిర్‌ కమాండ్‌ లో ఇకపై కీలక బాధ్యతలను నిర్వహించనున్నారు.

భారత వైమానిక దళంలోని దాదాపు 40 ఎయిర్ బేస్ లు WAC నియంత్రణలోనే ఉంటాయి. రాజస్తాన్‌లోని బికనీర్‌ నుంచి సియాచిన్‌ గ్లేసియర్‌ వరకు గల గగనతలాన్ని WAC నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. కార్గిల్‌ యుద్ధ సమయంలో పాకిస్తాన్‌ సైనిక స్థావరాలపై తన యుద్ధ విమానం ద్వారా ఐదు లేజర్ గైడెడ్‌ బాంబులను విసిరిన నంబియార్‌.. భారత్‌ కార్గిల్ యుద్ధంలో గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించారు.

అంతేకాకుండా ఎయిర్‌ మార్షల్‌గా మిరాజ్‌-2000లో సుమారు 2300 గంటల పాటు ప్రయాణించిన ఘనత కూడా నంబియార్ సొంతం. మిరాజ్‌తో పాటు తొలి రాఫెల్‌ ఫైటర్‌ జెట్‌ను కూడా నడిపిన ఆయన సీనియర్‌ టెస్టు పైలట్‌, కమాండింగ్‌ ఆఫీసరుగా కూడా పనిచేశారు. 2002లో నంబియార్ వాయుసేన మెడల్‌ పొందారు.