ఢిల్లీ అల్లర్లు..అర్ధరాత్రి ఎంట్రీ ఇచ్చిన ట్రబుల్ షూటర్

  • Published By: madhu ,Published On : February 26, 2020 / 08:24 AM IST
ఢిల్లీ అల్లర్లు..అర్ధరాత్రి ఎంట్రీ ఇచ్చిన ట్రబుల్ షూటర్

ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు..పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ట్రబుల్ షూటర్‌గా పేరొందిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ రంగంలోకి దిగారు. అర్ధరాత్రి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. 2020, ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం అర్ధరాత్రి రంగంలోకి దిగిన అజిత్‌ దోవల్‌ జాఫ్రాబాద్, శీలంపూర్ ప్రాంతాల్లో పర్యటించారు. వివిధ మతాలకు చెందిన నేతలతో ఆయన చర్చలు జరిపారు. ఆందోళన మూలాలపై ఫోకస్ చేసిన దోవల్… అల్లరిమూకలు ఎక్కడ నక్కాయన్న విషయంపై ఆరా తీస్తున్నారు. ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్చను కల్పించారు. 

పౌరసత్వసవరణ చట్టానికి సంబంధించి చెలరేగిన హింసపై అజిత్ దోవల్ సమీక్షిస్తున్నారు. ఢిల్లీలో హింసను ఆపే బాధ్యతను కేంద్రం దోవల్‌కు అప్పగించింది. ఢిల్లీలో హింసను నిలువరించేందుకు పోలీసులకు పూర్తి అధికారాలను కేంద్రం కట్టబెట్టింది. ఢిల్లీలోని తాజా పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రిమండలికి అజిత్ దోవల్ వివరించనున్నారు. పరిస్థితిని అణచివేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నామో తెలియజేస్తారు.

మరోవైపు ఢిల్లీ ఉద్రిక్తతల నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటివరకు 3 సార్లు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈశాన్య ఢిల్లీలో సీబీఎస్‌ఈ పరీక్షలను వాయిదా వేశారు.

ఈశాన్య ఢిల్లీలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. 2020. ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం ఉదయం కూడా అల్లర్లు చోటు చేసుకున్నాయి. జీటీబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు. ఢిల్లీ హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 20కి చేరింది. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు, పారమిలటరీ బలగాలను భారీగా మోహరించారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో గత రెండు నెలలకు పైగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించడంతో ఆ మార్గం ద్వారా రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు ఇద్దరు మధ్యవర్తులను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు న్యాయవాదులు ఆందోళనకారులతో చర్చలు జరిపినా ఫలితం కనిపించలేదు. ఆందోళన చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని…ఇతరుల హక్కులకు భంగం కలగకుండా చూడాలని మధ్యవర్తులు సీఏఏ ఆందోళనకారులకు సూచించారు. అయినప్పటికీ ఆందోళనకారులు తమ ఆందోళన విరమించలేదు. 

అజిత్ దోవల్ : – 

అజిత్ దోవల్ విషయానికి వస్తే..ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరించగలుగతారని పేరుంది. కేంద్ర ప్రభుత్వంలో ఈయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. యుద్ధవ్యూహాలో ఈయన దిట్ట అంటుంటారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఈయన కీలకంగా వ్యవహరించారు. IPS అధికారి అయిన దోవల్ గతంలో భద్రాతపరమైన ఆపరేషన్లను స్వయంగా నిర్వహించారు. భారత ఇంటెలిజెన్స్, లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారిగా ఈయన పనిచేశారు. సంక్లిష్ట సమయాల్లో ఆయన తీసుకొనే నిర్ణయాలు కీలకంగా మారుతున్నాయి. 

Read More : ఢిల్లీలో టెన్షన్ : హోం మంత్రి రాజీనామా చేయాలన్న సోనియా