ఏకే 203 : ఇండియన్ ఆర్మీ బలోపేతం

  • Published By: veegamteam ,Published On : April 12, 2019 / 01:06 PM IST
ఏకే 203 : ఇండియన్ ఆర్మీ బలోపేతం

ఇండియన్‌ ఆర్మీ మరింత ధైర్యంగా ముందుకు కదలనుంది. శత్రువు ఆటకట్టించే అద్భుతమైన ఆయుధం అందుబాటులోకి రానుంది. ఉగ్రమూకలను సరిహద్దు వంక కూడా చూడకుండా చేసే పాశుపతాస్ర్తం సిద్ధమవుతోంది. గుండెలనిండా ధైర్యంతో ముందుకు కదిలే భారత సైనికుడి చేతికి అత్యాధునిక ఆయుధం అందనుంది. సరిహద్దు వెంబడి పెరిగిపోతున్న ఉగ్రభూతం అంతానికి.. శత్రు సైన్యం కవ్వింతలకు సరైన సమాధానం చెప్పేందుకు బలమైన వెపన్‌ రెడీ అవుతోంది.

భారత సైనికుడు మరింత బలవంతుడుగా మారుతున్నాడు. తన అమ్ములపొదిలోకి వచ్చి చేరనున్న కొత్త ఆయుధంతో శక్తివంతుడిగా నిలవనున్నాడు. ఇంతకుముందు కన్నా మరింత దూకుడుగా కదనరంగంలోకి దూకి శత్రువును అంతం చేయనున్నాడు. తుప్పుపట్టిన తుపాకీ వదిలి.. అత్యాధునిక ఏకే 203తో యుద్ధ రంగానికి తరలనున్నాడు.

గన్స్‌లో ఏకే 47ది ప్రత్యేకమైన స్థానం. మొదటి రెండో ప్రపంచ యుద్ధాలను గమనించి తయారు చేసిన ఆయుధమిది. ఆ తర్వాత కూడా ఏకే గ్రూప్‌ నుంచి అనేక ఆయుధాలు వచ్చాయి. కొత్త వర్షన్‌ వచ్చిన ప్రతిసారీ అత్యాధునికంగా తయారవుతూ తన రేంజ్‌ను పెంచుకుంది. ఆయుధ శ్రేణిలో తన స్టైలే వేరంటూ నిరూపించింది. ఆ క్రమంలోనే ఏకే 203 కొత్త హంగులతో, సరికొత్త ఫీచర్స్‌తో తయారైంది. ఇప్పుడిదే ఇండియన్‌ ఆర్మీ చేతికి రానుంది.

భారత సైన్యాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో భారత ప్రభుత్వం .. ఏకే 203 వెపన్స్‌ను అందించేందుకు సిద్ధమయ్యింది. ఇందులో భాగంగా.. రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆయుధాలను కొనుగోలు చేయడం కాదు.. దానితో భారతీయ యువతకు ఉపాధి కలగాలని భావించి మేకిన్‌ ఇండియాతో దీన్ని లింక్‌ చేసింది. ఉత్తరప్రదేశ్‌ అమేథీ నియోజకవర్గంలోని కొర్వా ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీలో వీటి తయారీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆర్డనెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డ్‌, రష్యాకు చెందిన కల్‌ష్నికోవ్‌ కలిసి జాయింట్‌ వెంచర్‌గా ఈ ప్రాజెక్టు చేపడుతున్నాయి.

మొత్తం 7లక్షల 50 వేల ఏకే 203 రైఫిల్స్‌ కోసం రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది ఇండియన్‌ గవర్నమెంట్‌. ముందుగా ఇండియన్‌ ఆర్మీకి.. తర్వాత పారా మిలిటరీ బలగాలకు కూడా వీటిని అందించాలనే ప్రణాళికతో ఉంది. మొత్తంగా భారత సైనికులు, బలగాలందరికీ ఏకే 203 రైఫిల్‌ను అందచేయనుంది. అలాగే అమెరికాతోనూ మరో ఒప్పందం చేసుకుంది. ఆ దేశానికి చెందిన అత్యాధునిక సిగ్‌ సోవర్‌ అసాల్ట్‌ రైఫిల్స్‌ కోసం ఆర్డర్‌ ఇచ్చింది. 

పాక్‌ సరిహద్దు వెంబడి పహారా కాసే సైనికులు.. ఎప్పటినుంచో ఆధునిక ఆయుధాలు కావాలని అడుగుతున్నారు. ప్రస్తుతం వాడుతున్న ఇన్సాస్‌ వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని డిఫెన్స్‌కు మొరపెట్టుకుంటున్నారు. దశాబ్ధానికి పైగా వీటి స్థానంలో కొత్త ఆయుధాలు తీసుకురావాలని భావిస్తున్నా.. అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఇటీవల నెలకొన్న పరిస్థితులు.. కశ్మీర్‌లో పెరిగిన ఉగ్రవాదం, ఎల్‌వోసీ వెంబడి పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలతో మోడీ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఏకే 203 రైఫిల్స్‌తో భారత సైనికున్ని శక్తివంతుడిగా తయారు చేస్తోంది.

ఉగ్రవాదులు అత్యాధునిక ఆయుధాలు వాడుతుంటే.. ఆర్మీ మాత్రం కాలం చెల్లిన తుపాకులతో కుస్తీలు పట్టేది. ఈ క్రమంలో చాలాసార్లు సైనికులు వీర మరణం పొందారు. దీన్ని తప్పించేందుకే.. శత్రువులను చీల్చి చెండాడేందుకు భారత ప్రభుత్వం ఎట్టకేలకు ముందడుగు వేసింది. ఇది ఇండియన్‌ ఆర్మీకి కొండంత బలాన్నిస్తుంది. గుండెల నిండా ఉన్న ధైర్యానికి ఏకే 203 తోడై మరింత ధీరులుగా మారుస్తుంది. భారత బలగాలు మెల్లిమెల్లిగా అత్యంత శక్తివంతంగా మారుతున్నాయి. అనుకోని పరిస్థితులు వస్తే ధీటుగా సమాధానం చెప్పేలా తయారవుతున్నాయి.