సంచలన నిర్ణయం తీసుకున్న అఖిలేశ్‌ యాదవ్‌

  • Published By: vamsi ,Published On : August 23, 2019 / 04:14 PM IST
సంచలన నిర్ణయం తీసుకున్న అఖిలేశ్‌ యాదవ్‌

ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ సంచలన నిర్ణయాలను దూకుడుగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తమ పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి, జిల్లా, యూత్‌వింగ్‌ విభాగాలు, ఇతర అనుబంధ సంస్థలు అన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్‌ ఉత్తమ్‌ మినహా మిగతా నాయకులు అందరినీ పదవుల నుంచి తొలగించినట్లు తెలుస్తుంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన క్రమంలో పార్టీ ప్రక్షాళనకై అఖిలేశ్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ అనుబంధ సంస్థల నాయకులను తొలిగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ అనుబంధ సంస్థల నాయకుల పనితీరు గమనించిన అఖిలేష్ పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే పార్టీ ఘోర వైఫల్యానికి కారణాలను అన్వేషించే క్రమంలో అఖిలేశ్‌ ప్రక్షాళన చర్యలకు దిగినట్టు ఎస్పీ సీనియర్‌ నేతలు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి కార్యకర్తలు, ఆఫీస్‌ బేరర్లతో సమావేశమవుతూ.. బలం పెంచుకునేందుకు నిర్ణయాలు తీసుకుంటున్న అఖిలేష్.. క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేపడుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు కూడా రెండేళ్ల సమయమే ఉన్న క్రమంలో బీజేపీ మీద పైచేయి సాధించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పార్టీ మీడియా వింగ్‌కు చెందిన టీవీ ఛానెళ్ల అధికార ప్రతినిధులను అఖిలేశ్‌ ఇంతకుముందే తొలగించిన విషయం తెలిసిందే.