All The Best : మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్..ఆస్ట్రేలియా Vs భారత్

  • Published By: madhu ,Published On : March 8, 2020 / 02:39 AM IST
All The Best : మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్..ఆస్ట్రేలియా Vs భారత్

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు.. ఉత్కంఠగా గడుపుతున్న సమయం.. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తుది సమరానికి సిద్ధమయ్యింది. కాసేపట్లో మెల్‌బోర్న్‌ వేదికగా జరగనున్న ఫైనల్లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో హన్మన్ సేన తలపడుతోంది. టీ20 ప్రపంచకప్‌లో తొలి సారిగా ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్ ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉంది. 

ఒక్క విజయం.. ఒకే ఒక్క విజయం టీ20 ప్రపంచక్‌పలో భారత జట్టు విజేతగా నిలిచేందుకు. కాసేపట్లో జరిగే మ్యాచ్‌ కోసం దేశం మొత్తం ఉద్వేగంగా ఎదురు చూస్తోంది. తొలిసారి కప్‌ను ముద్దాడాలని హర్మన్‌సేన ఉవ్విళ్లూరుతుండగా, అభిమానుల మధ్య అయిదోసారి కప్‌ను అందుకోవాలని ఆసీస్‌ భావిస్తోంది. లీగ్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ను చిత్తుచేయడం భారత్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచే విషయం. అయితే ఫైనల్లో ప్రత్యర్థి జట్టును బోల్తా కొట్టించడం కంగారూలకి వెన్నతో పెట్టిన విద్య. గత అయిదు సీజన్లలో వరుసగా ఫైనల్‌కు చేరి నాలుగు ట్రోఫీలను గెలిచిన రికార్డే వారికి ఎంతో ధైర్యాన్నిస్తుంది. కానీ, భారత్‌ విధ్వంసకర ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మతి మంధాన ఫైనల్లో చెలరేగితే ఆసీస్‌ తలవంచాల్సిందే. దీంతో ఇరు జట్లపై ఫైనల్‌ ఒత్తిడి ఎంతో ఉంది.    

ఫైనల్ పోరులో అందరి దృష్టి లేడీ సెహ్వాగ్ షెఫాలీ వర్మపైనే ఉంది.. భారత్‌ సాధించిన ప్రతి విజయంలో ఆమెది కీలక పాత్ర పోషించింది. ఆది నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులకు ఒత్తిడి పెంచింది.  ఫైనల్లోనూ షెఫాలీ విజృంభిస్తే మ్యాచ్‌పై భారత్‌ పట్టు సాధించడం పక్కా. ఇక మరో ఓపెనర్ స్మృతి, కెప్టెన్ హర్మన్ ప్రీత్, జెమిమా రోడ్రిగ్స్ మెరవాల్సి ఉంది. ఆసీస్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడిన స్మృతి, హర్మన్‌.. తమ అనుభవాన్ని మ్యాచ్‌లో ప్రదర్శించాల్సి ఉంది.

టోర్నీలోలో ఓటమి లేకుండా ఫైనల్ కు చేరిన భారత్ ను.. కలవరపెడుతున్న ఒకే ఒక్క అంశం బ్యాటింగ్. లీగ్ దశ నుంచి అన్ని మ్యాచుల్లోనూ టీమిండియా విజయం సాధించినా.. ఇప్పటి వరకూ స్కోరు బోర్డు ఒక్కసారి కూడా 150 దాటలేదు.. అయినా జట్టు గెలిచిందంటే ఆ క్రెడిట్ అంతా బౌలర్లదే. స్పిన్నర్ పూనమ్‌ యాదవ్, పేసర్‌ శిఖ పాండే విజయాల్లో కీలక పాత్ర పోషించారు. రాధా యాదవ్‌, రాజేశ్వరి గైక్వార్డ్‌ లు కూడా అద్భుత ప్రదర్శన చేశారు. భారత్ కప్‌ను ముద్దాడాలంటే ఫైనల్లో వీరంతా సత్తా చాటాలి.

అయితే కీలక మ్యాచ్ లో ఆస్ట్రేలియాను గెలవడం అంత సులువు కాదు.. గాయాలతో ఆల్‌రౌండర్‌ ఎలీస్ పెర్రీ, పేసర్ తాల్యా వ్లామ్నిక్‌ జట్టుకు దూరమైనా.. ఆసిస్ ను తక్కువ అంచనా వేయలేము. అయితే ప్రపంచకప్ లీగ్‌ మ్యాచ్‌లో హర్మన్‌సేన చేతిలో ఓటమి చవిచూడటం ఆసీస్‌ను ఆందోళన పెట్టించే విషయం. కానీ టోర్నీలో వరుస విజయాలను సాధించి ఆసీస్ ఫైనల్‌కు చేరుకుంది. ఆసిస్ బ్యాటింగ్ లో కెప్టెన్ మెగ్ లానింగ్, బెత్ మూనీ, ఎలీసా హీలీ మంచి ఫామ్ లో ఉన్నారు.. ఇక బౌలర్లలో మెగాట్ షట్, జోనాసెన్ రాణిస్తున్నారు. 
మెల్‌బోర్న వేధికగా కాసేపట్లో జరిగే ఈ మ్యాచ్ లో.. పిచ్ పిచ్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండిటికి అనుకూలిస్తుంది. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఉమన్స్ వరల్డ్ కప్ గెలవాలని హర్మన్ సేనతో పాటు.. దేశం మొత్తం కోరుకుంటోంది. ఈ బిగ్ ఫైట్ కు సిద్ధమవుతున్న టీమిండియాకు 10టీవీ తరపున ఆల్ ద బెస్ట్. 

మహిళా టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో తలపడనున్న.. భారత్, ఆస్ట్రేలియా జట్లకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మెల్బోర్న్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ పై ట్విట్టర్ లో మోదీ స్పందించారు. మెరుగైన జట్టే విజయం సాధిస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. విజయం ఎప్పుడూ అత్యుత్తమ జట్టునే వరిస్తుంది. టీమిండియా, ఆస్ట్రేలియా మహిళలు బాగా ఆడాలని కోరుకుంటున్నారని మోదీ అన్నారు. ఇరు జట్లకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మోదీ.. నీలి పర్వతాల మాదిరిగా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం నీలివర్ణం సంతరించుకుంటుందని.. పరోక్షంగా ఇండియా గెలవాలన్న ఆకాంక్షను ట్విట్టర్ లో పంచుకున్నారు.