అందరి చూపు నందిగ్రామ్ వైపే : దీదీ సత్తా చాటుతారా ?

పశ్చిమబెంగాల్‌లో రాజకీయ సెగలు రేగుతున్నాయి. నందిగ్రామ్ నియోజకవర్గం చుట్టే.. రాష్ట్ర రాజకీయమంతా తిరుగుతోంది. అటు సీఎం మమతా బెనర్జీ, ఇటు ప్రస్తుత బీజేపీ, మాజీ టీఎంసీ నేత సువేందు అధికారి... ఈ ఇద్దరి పోటీతో నందిగ్రామ్‌లో ఎలక్షన్‌ హీట్‌ టాప్‌పిచ్‌కు చేరింది.

అందరి చూపు నందిగ్రామ్ వైపే : దీదీ సత్తా చాటుతారా ?

Nandigram

Nandigram : పశ్చిమబెంగాల్‌లో రాజకీయ సెగలు రేగుతున్నాయి. నందిగ్రామ్ నియోజకవర్గం చుట్టే.. రాష్ట్ర రాజకీయమంతా తిరుగుతోంది. అటు సీఎం మమతా బెనర్జీ, ఇటు ప్రస్తుత బీజేపీ, మాజీ టీఎంసీ నేత సువేందు అధికారి… ఈ ఇద్దరి పోటీతో నందిగ్రామ్‌లో ఎలక్షన్‌ హీట్‌ టాప్‌పిచ్‌కు చేరింది. ఒకనాటి గురుశిష్యులు నేడు ప్రత్యర్థులుగా తలపడుతుండటంతో దేశవ్యాప్తంగా నందిగ్రామ్‌ హాట్‌టాపిక్‌గా మారింది.

భవానిపూర్ ను వదిలి : –
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం ఇప్పుడు కీలకంగా మారింది. సీఎం మమతా బెనర్జీ.. తన సిట్టింగ్ స్థానమైన భవానిపూర్‌‌ని వదిలి ఇప్పుడు తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఒక్క నిర్ణయం.. బెంగాల్ రాజకీయాల్లో తుపాను పుట్టించింది. మమత తీసుకున్న ఈ నందిగ్రామ్ మూవ్‌ను.. పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్‌‌గా చెబుతున్నారు. గత రెండు ఎన్నికలతో పోలిస్తే బెంగాల్‌లో పొలిటికల్ సినారియోలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఈసారి కూడా గెలిచి.. బెంగాల్‌లో హ్యాట్రిక్ కొట్టాలని తృణమూల్ కాంగ్రెస్ తహతహలాడుతోంది.

వ్యూహాత్మకం : –
అందుకే.. దీదీ చాలా వ్యూహాత్మకంగా నందిగ్రామ్ నుంచి పోటీకి దిగినట్లు చెబుతున్నారు. తాజా బెంగాల్ ఎన్నికల్లో.. నందిగ్రామ్ కీలకంగా మారటానికి చాలా పెద్ద రీజనే ఉంది. రాష్ట్రంలోని.. రెండు భారీ పొలిటికల్ పర్సనాలిటీలు.. ఇక్కడి నుంచి పోటీకి దిగడమే ఇందుకు కారణం. పార్టీ ఫిరాయించిన తర్వాత.. బీజేపీలో సువేందు అధికారి చాలా కీలకమైన నేతగా ఉన్నారు. టీఎంసీ నుంచి నేరుగా సీఎం మమతా బెనర్జీనే అక్కడ పోటీ చేస్తుండటంతో.. స్టేట్ అటెన్షన్ అంతా నందిగ్రామ్ వైపే మళ్లింది. భారీ పొలిటికల్ వెయిట్ ఉన్న లీడర్లు మమతా బెనర్జీ, సువేందు అధికారి.. ఒకరిపై ఒకరు పోటీకి దిగడం ఇప్పుడు బెంగాల్ రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చింది.

బీజేపీ ఎన్నికల ప్రచారం : –
ఇటీవలే ప్రధాని నరేంద్రమోదీ బెంగాల్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో.. సీఎం మమతా బెనర్జీపై మోదీ విమర్శలు గుప్పించారు. తామెవరినీ బాధపెట్టదలచుకోలేదని చెప్పారు. కానీ.. దీదీ స్కూటీ భవానిపూర్‌కు బదులుగా నందిగ్రామ్‌లో ల్యాండ్ అయ్యిందన్నారు. ఇప్పుడేమీ చేయలేమని.. మోదీ తన స్టైల్లో సెటైర్లు వేశారు. నందిగ్రామ్‌లో.. మాజీ టీఎంసీ నేత సువేందు అధికారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్‌లో.. మమత తర్వాత అంతటి లీడర్‌గా సువేందుకు పేరుంది. అతన్ని.. బీజేపీ ఇటీవలే తమ పార్టీలోకి లాగేసింది. ఇప్పుడతనిపైనే మమత పోటీకి దిగుతోంది. నందిగ్రామ్‌లో తాను లోకల్ అని సువేందు అధికారి మమతకు సవాల్ విసిరారు. దీంతో.. అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానంటూ.. మమత గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

పెద్ద వ్యూహాలు : –
మమత నందిగ్రామ్‌లో పోటీ వెనక పెద్ద వ్యూహమే ఉంది. అటు బీజేపీ, ఇటు టీఎంసీ రెండూ కూడా వ్యూహాత్మక ఎత్తుగడల ఫలితమే ఇది. సువేందు అధికారి కుటుంబానికి నందిగ్రామ్‌తో పాటు చుట్టుపక్కల 40 నియోజకవర్గాల్లో గట్టి పట్టుంది. ఆ కుటుంబంలో ఇద్దరు ఎంపీలున్నారు. అందుకే సువేందు.. తనపై పోటీకి రావాలని మమతకు సవాల్ విసిరారు. అయితే ఇక్కడ మమత వ్యూహం వేరుగా ఉంది. సువేందుపై తానే స్వయంగా పోటీ చేస్తే ఆ ప్రాంతంలో పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని.. ఫలితంగా ఆ 40 నియోజకవర్గాల్లో టీఎంసీ విజయావకాశాలు మెరుగవుతాయని మమత భావించారు. బీజేపీకి కాస్తో కూస్తో పట్టున్న ఆ నియోజకవర్గాలను టార్గెట్‌ చేస్తే కమలానికి గట్టి దెబ్బ తగులుతుందని మమత భావించారు. పైగా ఒకప్పుడు నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ పోరాటం ఇంకా జనం మర్చిపోలేదు.

పెనుమార్పులు : –
ఇక బీజేపీ లెక్క వేరుగా ఉంది. మమతను ఇక్కడ పోటీకి ఆహ్వానించడం ద్వారా ఆమెను ట్రాప్‌లోకి లాగామని బీజేపీ భావిస్తోంది. ఇక్కడ సువేందును ఓడించడం మమతకు అంత సులభం కాదన్నది కమలనాథుల భావన. 2007 నందిగ్రామ్‌ ఉద్యమాన్ని ముందుండి నడిపింది సువేందునే.. ఆ ఉద్యమంతో 34 ఏళ్ల కమ్యునిస్టుల పాలనకు గండి పడింది. పైగా తాను లోకల్‌.. మమత నాన్‌లోకల్‌ అని ప్రచారం చేస్తున్నారు సువేందు. ఇక మమత దృష్టి అంతా తన నియోజకవర్గంపైనే ఉంటుందని మిగిలిన నియోజకవర్గాలపై ఫోకస్ తగ్గుతుందని బీజేపీ భావిస్తోంది. మొత్తంగా చూస్తే బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఇటీవలి పొలిటికల్ హిస్టరీని పరిశీలిస్తే.. నందిగ్రామ్‌లో సువేందు అధికారి, మమత బెనర్జీ పోటీ ఇప్పుడు కీలకంగా మారబోతోంది. ఈ పరిణామం.. ఎన్నికల ఫలితాలకు ముందు తర్వాత.. బెంగాల్ పాలిటిక్స్‌లో పెను మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు.