Lockdown States : భారత్‌లో కరోనా విజృంభణ.. లాకేస్తున్న రాష్ట్రాలు

భారతదేశంలో కరోనా మహమ్మారి వదలడం లేదు. వైరస్ సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తూనే ఉంది. లక్షల కేసులు నమోదవుతున్నాయి. ప్రధాన రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు రికార్డ్ స్థాయిలో బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Lockdown States : భారత్‌లో కరోనా విజృంభణ.. లాకేస్తున్న రాష్ట్రాలు

All Indian States Go Lockdown Effect Of Covid Second Wave

భారతదేశంలో కరోనా మహమ్మారి వదలడం లేదు. వైరస్ సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తూనే ఉంది. లక్షల కేసులు నమోదవుతున్నాయి. ప్రధాన రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు రికార్డ్ స్థాయిలో బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కఠిన నిబంధనలు, కర్ఫ్యూల బాటలు పట్టిన కొన్ని రాష్ట్రాలు.. చివరికి లాక్‌డౌన్ వరకు వెళ్లక తప్పలేదు. మరికొన్ని రాష్ట్రాలు వైరస్‌కు చెక్‌ పెట్టేందుకు ఆ లాక్‌ను అలాగే పొడిగిస్తున్నాయి.

కర్ణాటకలో ప్రభుత్వం ప్రకటించిన సంపూర్ణ లాక్‌డౌన్‌ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఇవాళ ఉదయం 6 గంటలకు ప్రారంభమైన లాక్‌డౌన్ మే 24 ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. సెమీ లాక్‌డౌన్‌ తరహాలో కాకుండా ఇవాళ్టి నుంచి కఠిన నిబంధనలు అమలు కానున్నాయి. 10 రోజులుగా విధించిన జనతా కర్ఫ్యూతో కరోనా కట్టడి కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. ఇక లాక్‌డౌన్‌ సమయంలో ప్రజల రాకపోకలపై పూర్తిస్థాయిలో నిషేధాజ్ఞలు ఉంటాయని, అత్యవసర సర్వీసులు మినహా మరేమీ అనుతించమని తేల్చిచెప్పారు కర్నాటక సీఎం. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే నిత్యావసరాలకు అనుమతి ఉంటుందని.. ఆ తర్వాత అన్నీ బంద్ చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు.

తమిళనాడులోనూ సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. ఇవాళ తెల్లవారుజామున నుంచి మొదలైన లాక్‌డౌన్.. 24 వరకు అమల్లో ఉంటుంది. విదేశాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి విమానం, రైళ్ల ద్వారా వచ్చే ప్రయాణికులతో సహా అందరికీ ఈ-రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేసింది తమిళ సర్కార్‌. రాత్రి వేళల్లో ప్రయాణికులు తమ టిక్కెట్లు చూపించి విమానాశ్రయానికి వెళ్లవచ్చని తెలిపింది. నిత్యావసరాలకు మాత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతిచ్చింది. ఆడిటోరియం, మైదానాలు, రాజకీయపార్టీల సమావేశాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, విద్య లాంటి కార్యక్రమాలపై నిషేధం విధించింది స్టాలిన్ సర్కార్‌. రెస్టారెంట్లు, హోటల్స్‌లలో కేవలం పార్శిల్ సేవలకు మాత్రం పర్మిషన్ ఉందని తెలిపింది.

రాజస్థాన్‌లో కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు రెండు వారాలు లాక్‌డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. నేడు ఉదయం ప్రారంభమైన లాక్‌డౌన్.. 24 వరకు అమల్లో ఉంటుందన్నారు. కేవలం ఎమర్జెన్సీ సేవలకు మాత్రమే పరిష్మన్ ఇస్తామన్నారు. ఈ 14 రోజుల్లో పెళ్లిళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాలు, ఉపాధి హామీ పథకాలు కూడా ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 31 తరువాత మాత్రమే వివాహాలకు అనుమతిస్తామని పేర్కొంది.

ఇక ఢిల్లీలో కరోనాను కంట్రోల్ చేసేందుకు మరోసారి లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగించింది కేజ్రీవాల్ సర్కార్. ఈసారి లాక్‌డౌన్‌లో మెట్రో సర్వీసులను కూడా రద్దు చేశారు. లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇస్తుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా లాక్‌డౌన్‌లో ఉన్న ఢిల్లీలో కేసులు కొద్దిగా త‌గ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో ఈ చర్యలను మ‌ధ్యలో వదిలేయ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో లాక్‌డౌన్‌ను పొడిగించారు. ఏప్రిల్‌ మ‌ధ్యలో ఢిల్లీలో పాజిటివిటీ రేటు 35 శాతంగా ఉండగా.. ఇప్పుడ‌ు 23 శాతానికి పడిపోయింది.

ఉత్తరప్రదేశ్ లోనూ మరోసారి లాక్‌డౌన్ ను పొడిగించారు. ఇప్పటికే రెండుసార్లు లాక్ డౌన్ ను పొడిగించిన యోగి సర్కార్.. ఇప్పుడు మూడోసారి లాక్ డౌన్ ను పొడిగించక తప్పలేదు. కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మే 17వ తేదీ వరకు లాక్ డౌన్‌ను పొడిగించారు. మొదటి వేవ్ సమయంలో లాక్ డౌన్‌ను అమలు చేసి కరోనాను సమర్ధవంతంగా కంట్రోల్ చేసింది యూపీ ప్రభుత్వం. సెకండ్ వేవ్ ఉధృతి అధికంగా ఉండటంతో రోజూ వేల సంఖ్యలో కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. లాక్ డౌన్ తప్పితే మరొక మార్గం లేకపోవడంతో లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు.

అటు హర్యానా ప్రభుత్వం కూడా లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఇప్పటికే వారం రోజులు లాక్‌డౌన్‌ విధించిన సర్కార్.. మరో వారం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. హర్యానాలో నిత్యం వందకు పైగా కరోనా రోగులు మృతి చెందుతున్నారు. 10వేలకు పైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. దీంతో వైరస్ కట్టడి చర్యలో భాగంగా మరో వారం లాక్‌డౌన్‌ను పొడిగించింది.