Amazon Poison : అమెజాన్‌లో అమ్మకానికి విషం… బాలుడు ఆత్మహత్య.. మరో వివాదంలో E-కామర్స్ దిగ్గజం

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వివాదాలకు కేరాఫ్ గా మారుతోంది. తరుచూ ఇబ్బందుల్లో పడుతోంది. ఇటీవల అమెజాన్ వేదికగా జరుగుతున్న గంజాయి అమ్మకాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

10TV Telugu News

Amazon Poison : ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వివాదాలకు కేరాఫ్ గా మారుతోంది. తరుచూ ఇబ్బందుల్లో పడుతోంది. ఇటీవల అమెజాన్ వేదికగా జరుగుతున్న గంజాయి అమ్మకాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇది మరువక ముందే అమెజాన్‌ మరో వివాదంలో చిక్కుకుంది. అమెజాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలుడు అమెజాన్ ద్వారా విషం (సెల్ఫస్ ట్యాబ్లెట్లు) కొనుగోలు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఈ విషయాన్ని హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా దృష్టికి తీసుకువెళ్లారు.

Chrome Password Checker : మీ పాస్‌వ‌ర్డ్ హ్యాక‌ర్ల చేతుల్లో.. అయితే డౌటే.. ఇలా చెక్ చేసుకోండి!

ఆన్‌లైన్‌లో విషం అమ్మిన ఘటనను మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అమెజాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను హోంమంత్రి మిశ్రా ఆదేశించారు. అమెజాన్ నిర్వాహకుడిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. గత జూలైలో బాలుడి తల్లిదండ్రులు తనను ఇండోర్ లో కలిశారని, తమ కొడుకు అమెజాన్ లో విషం కొన్నాడని వారు తనకు తెలిపారని మంత్రి చెప్పారు.

బాలుడి పేరు ఆదిత్య. అతడి తండ్రి పేరు రంజిత్ వర్మ. ఇండోర్ లో లోధీ కాలనీలో నివాసం ఉంటున్నారు. రంజిత్ వర్మ పండ్ల వ్యాపారి. జూలై 29న తన కొడుకు సెల్ఫస్ ట్యాబెట్లు మింగాడని, వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లామని, మరుసటి రోజు ఆదిత్య చనిపోయాడని అతడి తండ్రి కన్నీరుమున్నీరు అయ్యాడు. ఈ కామర్స్ పోర్టల్ అమెజాన్.. ఆన్ లైన్ ఆర్డర్ ద్వారా ఎంతో సులభంగా విషం దొరికేలా చేసిందని బాలుడు ఆదిత్య తండ్రి రంజిత్ వర్మ వాపోయాడు. తన కొడుకు చేసిన ఆన్ లైన్ లావాదేవీకి సంబంధించిన డెలివరీ ప్యాక్, పత్రాలను బాలుడి తండ్రి పోలీసులకు చూపించాడు. ఆదిత్య మొత్తం నాలుగు ప్యాకెట్లు ఆర్డర్ చేశాడు.

”అమెజాన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను బాలుడి తల్లిదండ్రులు అనేకసార్లు కోరారు. అయితే ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దీంతో నేను రంగంలోకి దిగాను. అమెజాన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, మధ్యప్రదేశ్ అమెజాన్ హెడ్ ని అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చాను. ఒకవేళ వాళ్లంతట వాళ్లు వస్తే సరి, లేదంటే వారిని పోలీస్ స్టేషన్ కు ఈడ్చుకుని రావాలని పోలీసులతో చెప్పానని ” హోంమంత్రి మిశ్రా చెప్పారు. సెల్ఫస్ ట్యాబెట్లు బయట ఎక్కడా దొరకవు. అయితే ఆన్ లైన్ లో మాత్రం సులభంగా లభించాయి. జూలై 22న ఆదిత్య సెల్ఫస్ ను ఆన్ లైన్ లో బుక్ చేశాడు.

Dinner : సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం ఎందుకంటే?

ఇండోర్ కలెక్టర్ మనీష్ సింగ్ దీనిపై స్పందించారు. అమెజాన్ పై కేసు నమోదైనట్టు తెలిపారు. విచారణలో అమెజాన్ తప్పు ఉందని తేలితే జాతీయ భద్రతా చట్టం కింద అమెజాన్ పై కేసు నమోదు చేస్తామన్నారు కలెక్టర్ మనీష్ సింగ్.

కాగా నవంబర్ 16న అమెజాన్ ద్వారా ఆన్‌లైన్‌లో గంజాయి విక్రయిస్తుండగా బింధ్ పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ గంజాయి ఏపీలోని విశాఖ నుంచి వచ్చిందని పోలీసుల విచారణలో వెల్లడైంది.

డ్రగ్ పెడ్లర్ మాస్టర్ ప్లాన్ వేశాడని, ఈ కామర్స్ వెబ్ సైట్ లో ఖాదీ పట్టా అమ్ముతున్నట్టు రిజిస్ట్రర్ చేయించుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు అతడు ఆన్ లైన్ ద్వారా రూ.కోటి 10లక్షల విలువైన గంజాయి విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు. ఇందుకుగాను సెల్లర్ నుంచి అమెజాన్ 66శాతం కమిషన్ పొందింది. ఆన్ లైన్ లో గంజాయి అమ్మకాల వ్యవహారం వెలుగుచూడటంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ కామర్స్ సేవలకు కొత్త నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.