అంబులెన్స్ ఎక్కడ? : బైక్‌పై ఆస్పత్రికి.. హైవేపై మహిళ ప్రసవం

  • Edited By: sreehari , August 24, 2019 / 10:40 AM IST
అంబులెన్స్ ఎక్కడ? : బైక్‌పై ఆస్పత్రికి.. హైవేపై మహిళ ప్రసవం

అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. పురుటి నొప్పులతో సాయం కోసం ఎదురుచూసిన బాధిత మహిళకు నిరాశే ఎదురైంది. అనుకోని పరిస్థితుల్లో హైవేపై ప్రసవించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని బురాన్ పూర్ జిల్లాలోని రాష్ట్ర హైవేపై జరిగింది.

వివరాల్లోకి వెళితే.. కమలా బాయ్ అనే మహిళ ప్రసవవేదనతో బాధపడుతోంది. ఆస్పత్రికి వెళ్లేందుకు అంబులెన్స్ కు సమాచారం అందించారు. ఎంతసేపటికి అంబులెన్స్ రాకపోవడంతో నిండు గర్భిణీని ఆమె భర్త బైక్ మీద కూర్చొబెట్టుకుని ఆస్పత్రికి బయల్దేరారు.

మా కోడలికి నొప్పులు మొదలుకావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు, మంత్రసానికి, అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించాం. కానీ, అంబులెన్స్ రాలేదని, మార్గం మధ్యలోనే కమల ప్రసవించినట్టు మహిళ అత్త చంద్రా బాయ్ చెప్పింది. వీరిద్దరిని షాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. పుట్టిన బిడ్డ, తల్లి క్షేమంగానే ఉన్నారని అక్కడి వైద్యులు తెలిపారు.

పుట్టిన బేబీని తన చేతుల్లో పట్టుకుని తల్లి ఆస్పత్రికి వచ్చినట్టు బంధువులు చెప్పారు. అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంపై మహిళ తరపు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ తల్లిబిడ్డకు ప్రాణపాయం తప్పిందన్నారు. సమాచారం ఇచ్చిన స్పందించని అంబులెన్స్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.