ఢిల్లీలో వర్షం, గడ్డ కట్టే చలి..వెనక్కి తగ్గని రైతులు

  • Published By: madhu ,Published On : December 12, 2020 / 10:14 AM IST
ఢిల్లీలో వర్షం, గడ్డ కట్టే చలి..వెనక్కి తగ్గని రైతులు

farmers say will not vacate : దేశ రాజధానిలో వర్షం కురుస్తోంది. మరోవైపు గడ్డ కట్టే చలి. అయినా..రైతులు వెనుకడుగు వేయడం లేదు. తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ..పట్టుబడుతున్నారు. చలిలో..వర్షంలోనే..ఎక్కడ పడితే..అక్కడే పడుకుంటూ..తింటూ..తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న ఆందోళన 17వరోజుకి చేరుకుంది. 2020, డిసెంబర్ 12వ తేదీ శనివారం..ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘావృతమై ఉంది.. ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల కనిష్టస్థాయికి పడిపోయాయి.

దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ.. గడ్డ కట్టించే చలిని లెక్కచేయకుండా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆందోళనలో భాగంగా రైతులు శనివారం ఢిల్లీ – జైపూర్, ఢిల్లీ – ఆగ్రా రహదారుల దిగ్బంధనానికి ప్రయత్నిస్తున్నారు. టోల్‌గేట్ల దగ్గర ప్రజలు ఫీజు చెల్లించకుండా అడ్డుకుంటామని రైతులు ప్రకటించారు. దీంతో అంబాలా దగ్గర టోల్ ఫీజు వసూలు చేయకుండానే వాహనాలు పంపించివేస్తున్నారు అధికారులు. ఈ నెల 14 న ఉత్తర భారతదేశంలోని రైతులంతా ఢిల్లీ ముట్టడించాలని నిర్ణయించారు. అదే సమయంలో దక్షిణ భారత దేశంలోని రైతులు జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అటు రైతుల ఆందోళన దృష్ట్యా సెంట్రల్ ఢిల్లీలోని బీజేపీ నేతల నివాసాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు.

వ్యవసాయ చట్టాల రద్దుపై కేంద్రంతో అనేక విడతలుగా జరిగిన చర్చలు విఫలమవడంతో ఇప్పటికే భారతీయ కిసాన్ సంఘ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు ఆందోళనను ఉధృతం చేశారు రైతులు. పంజాబ్, అమృత్ సర్ నుంచి భారీగా రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్నారు. 700 ట్రక్కుల్లో రైతులు ఢిల్లీ కుండలి సరిహద్దులకు వచ్చారు. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్‌ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి రైతులు భారీగా తరలివస్తున్నారు. దీంతో సింఘు, టిక్రి, జారోదా, ఘాజీపూర్, చల్లా, నోయిడా లింక్ రోడ్డు, జటిక్రా సరిహద్దు రహదారులు మూసివేశారు. హర్యానా, నోయిడా నుంచి ఢిల్లీ వచ్చే వాహనాలను దారి మళ్లించారు. సరిహద్దుల్లోనూ, రైతులు బస చేస్తున్న బురారీలోని నిరంకారీ మైదానం దగ్గరా…భారీగా కేంద్ర బలగాలను మోహరించారు.