కాంగ్రెస్,ఎన్సీపీలతో విబేధాలు….మోడీని కలిసిన ఉద్దవ్

  • Published By: venkaiahnaidu ,Published On : February 21, 2020 / 12:50 PM IST
కాంగ్రెస్,ఎన్సీపీలతో విబేధాలు….మోడీని కలిసిన ఉద్దవ్

శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇవాళ(ఫిబ్రవరి-21,2020)తన కుమారుడు ఆదిత్యతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. అయితే కొన్నిరోజులుగా మహాప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్,ఎన్సీపీలతో శివసేనకు….ఎన్ పీఆర్,ఎన్ఆర్ సీ సహా ఎల్గర్ పరిషద్ కేసును ఎన్ఐఏకు అప్పగించడం వంటి పలు విషయాల్లో విబేధాలు వచ్చాయంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్,ఎన్సీపీ వ్యతిరేకిస్తున్న సీఏఏ,ఎన్ పీఆర్ కు తన మద్దతు ఉంటుందని ఈ వారం ప్రారంభంలో ఉద్దవ్ వ్యాఖ్యలు సంకీర్ణ ప్రభుత్వంలో కలకలం సృష్టించిన సమయంలో ఉద్దవ్ మోడీని కలవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సీఏఏ,ఎన్ఆర్సీ,ఎన్ పీఆర్ మూడు వేర్వేరు అని,సీఏఏ అమలు అయితే ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని ఈ వారం ప్రారంభంలో ఉద్దవ్ వ్యాఖ్యానించారు. ఎన్ ఆర్ సీ మాత్రం రాష్ట్రం అమలుచేయబడదని,ఇప్పటివరకు కేంద్రం ఎన్ఆర్సీ గురించి చర్చించలేదన్నారు.

అయితే మహావికాస్ అఘాడి ప్రభుత్వ ఏర్పడటానికి ప్రధాన కారణమైన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మాత్రం ఉద్దవ్ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ…సీఏఏ,ఎన్ పీఆర్ విషయంలో శివసేనతో మాట్లాడతామన్నారు. కాంగ్రెస్,ఎన్సీపీ,శివసేన ఒకే లైన్ లోకి వచ్చేలా ఉద్దవ్ ను ఒప్పిస్తామన్నారు. మరోవైపు ఎల్గర్ పరిషద్ కేసుని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)కు అప్పగించడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు శరద్ పవార్. రాష్ట్ర మంత్రులు పోలీస్ అధికారులను కలిసిన తర్వాత ఉద్దవ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. పవార్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే సీఎం ఉద్దవ్ ఠాక్రే ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో భీమా-కొరేగాన్ హింస కేసుకి సంబంధించిన దర్యాప్తును కేంద్రం స్వాధీనం చేసుకోకుండా చూస్తామని భరోసా ఇస్తున్నానంటూ ఆ ట్వీట్ లో తెలిపారు.

ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో ఉద్దవ్ ఇవాళ మోడీని కలవడం వెనక మంత్రాంగం నడిపింది శివసేన ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్ అని సమాచారం. మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎస్సీపీ ప్రభుత్వ ఏర్పాటులో సంజయ్ ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఉద్దవ్ ప్రధానిని కలుస్తున్నారు. ఇది సమావేశం మాత్రమే, ఇంకేమీ దానిలోకి చదవకూడదు. జై మహారాష్ట్ర అని మరాఠీలో సంజయ్ రౌత్ ఇవాళ ఉదయం ట్వీట్ చేశారు. 

ఉద్దవ్ తన ఢిల్లీ పర్యటనలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా,బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వాణీ సహా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కూడా కలవనున్నారు. అయితే ఉద్దవ్ ఇప్పుడు కాంగ్రెస్,ఎన్సీపీలకు హ్యాండ్ ఇచ్చి బీజేపీతో చేతులు కలుపబోతున్నారా అంటూ మహారాష్ట్ర ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరుగవచ్చు. ఎవ్వరూ శాశ్వత మిత్రులు కాదు,శాశ్వత శత్రువులు కాదు అనే విధానాన్ని మరోసారి ఉద్దవ్ ఆచరణలో పెడతారా లేదా అన్నది చూడాలి.