కాంగ్రెస్ పై విమర్శలు..RCEP విషయంలో మోడీ నిర్ణయంపై షా ప్రశంసలు

  • Published By: venkaiahnaidu ,Published On : November 4, 2019 / 04:20 PM IST
కాంగ్రెస్ పై విమర్శలు..RCEP విషయంలో మోడీ నిర్ణయంపై షా ప్రశంసలు

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (RCEP)ఒప్పందంలో చేరకూడదని ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు హోంమంత్రి అమిత్ షా. RCEP పై సంతకం చేయకూడదని భారత్ తీసుకున్న నిర్ణయం ప్రధాని మోడీ యొక్క బలమైన నాయకత్వానికి నిదర్శనమన్నారు. భారత్ ఆసక్తులు పట్టించుకోకపోతే ఒక ఒప్పందంతో ముందుకు సాగబోమని ప్రధాని మోడీ దృఢమైన నిర్ణయం తీసుకున్నారని షా అన్నారు. ఇది గతం నుంచి వెల్ కమ్ బ్రేక్ అన్నారు. కాంగ్రెస్ ఈ సందర్భంగా షా విమర్శలు గుప్పించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో  వాణిజ్యంపై విలువైన గ్రౌండ్ ను వదులుకుందని,యూపీఏ ప్రభుత్వం  జాతీయ ప్రయోజనాలను కాపాడుకోలేకపోయిందని షా విమర్శించారు.

మరోవైపు దీనిపై స్పందించిన కాంగ్రెస్.. RCEP ఒప్పందంలో చేరకూడదనే భారత్ నిర్ణయంపై కాంగ్రెస్ నైతిక విజయం సాధించిందని, తమ నిరసనలు, వ్యతిరేకత కారణంగానే బిజెపి ప్రభుత్వం ఈ ఒప్పందం నుండి తప్పుకోవలసి వచ్చిందని తెలిపింది.

బ్యాంకాక్‌ కు సమీపంలోని నాంతాబురిలో సోమవారం(నవంబర్-4,2019)జరిగిన ఆర్‌సీఈపీ సదస్సులో పాల్గొన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడుతూ….RCEP ఒప్పందం యొక్క ప్రస్తుత రూపం ప్రాథమిక స్ఫూర్తిని,అంగీకరించిన మార్గదర్శక సూత్రాలను లేదా  భారతదేశం యొక్క ఆందోళనను పూర్తిగా ప్రతిబింబించదని మోడీ అన్నారు. RCEP ఒప్పందాన్ని భారతీయులందరి ప్రయోజనాలకు సంబంధించి కొలిచినప్పుడు సానుకూల సమాధానం లభించలేదని, అందువల్ల తన మనస్సాక్షి RCEP లో చేరడానికి అనుమతించలేదని మోడీ తెలిపారు.

ఆర్‌సీఈపీలో భారత్‌ చేరితే, ఆసియాన్‌, జపాన్‌, దక్షిణకొరియాకు చెందిన 90 శాతానికిపైగా ఉత్పత్తులకు, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు చెందిన 74 శాతానికిపైగా ఉత్పత్తులకు సుంకాలను తొలిగించాల్సి ఉంటుంది. చైనా వస్తువులు అతి చౌక ధరలతో ఇండియాను ముంచెత్తితే చిన్న వ్యాపారాలు దెబ్బతింటాయని భారత ప్రభుత్వం ఆందోళనగా ఉంది. దివారంనాడు ఆసియాన్ నేతల సమావేశంలోనే భారత్ ఆందోళనను ప్రధాని పునరుద్ఘాటించారు. భాగస్వామ్య దేశాలన్నింటికీ అర్ధవంతమైన మార్కెట్‌ను కల్పించాలని తెగేసి చెప్పారు.