Amith Shah : 1971 భారత్-పాక్ వార్ హీరోని కలిసిన అమిత్ షా

రెండు రోజుల రాజస్తాన్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం జైసల్మేర్ లో.. 1971 భారత్-పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భైరో సింగ్ రాఠోడ్‌ ని కలిశారు.

Amith Shah : 1971 భారత్-పాక్ వార్ హీరోని కలిసిన అమిత్ షా

Amith Shah

Amith Shah : రెండు రోజుల రాజస్తాన్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం జైసల్మేర్ లో.. 1971 భారత్-పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భైరో సింగ్ రాఠోడ్‌ ని కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఆ నాటి యుద్ధ సమయంలో జరిగిన పలు విషయాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి.

భైరో సింగ్ రాఠోడ్‌ తో సమావేశం అనంతరం ట్వీట్ చేసిన అమిత్ షా..”1971 యుద్ధం సమయంలో లాంగేవాలాలో విధులు నిర్వహించిన భైరో సింగ్ రాఠోడ్ ని ఇవాళ జైసల్మేర్ లో కలవడం నాకు గొప్ప అదృష్టం. మాతృభూమి కోసం మీ శౌర్యం,ప్రేమ చరిత్ర సృష్టించింది. దేశప్రజల హృదయాలలో అపారమైన గౌరవం ఉంచింది. నేను నీకు తలవంచి నమస్కరిస్తున్నాను”అంటూ భైరో సింగ్ రాఠోడ్‌ తో సమావేశమైన ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు అమిత్ షా.

కాగా, భైరో సింగ్ రాఠోడ్‌ 1963లో సరిహద్దు భద్రతా దళం (BSF)లో చేరారు. భారత్-పాక్ యుద్ధం సమయంలో లోంగెవాలా పోస్ట్ వద్ద 23 పంజాబ్‌ బెటాలియన్ ను భారత సైన్యం మోహరించింది. దీనికి మేజర్ కుల్దీప్ సింగ్ చాంద్‌పురి నేతృత్వం వహించారు. భైరోను పంజాబ్ బెటాలియన్‌కు గైడ్‌గా నియమించారు. ఓ రోజు రాత్రి బాగా పొద్దు పోయిన తర్వాత భారత సైనికులకు ఓ సమాచారం అందింది. పాకిస్తాన్ దళాలు భారీ ట్యాంకులు, అతి పెద్ద సైన్యంతో వస్తున్నట్లు తెలిసింది. ఆ రాత్రి సమయంలో పాకిస్తాన్ దళాలను నిలువరించడానికి భారత వైమానిక దళం అందుబాటులో లేదు. దీంతో 120 మంది సైనికులు, భైరో సింగ్ వెంటనే లోంగెవాలా పోస్ట్‌ నుంచి పోరాడే బాధ్యతలను స్వీకరించారు. పాకిస్తాన్ సైన్యం విపరీతంగా కాల్పులు జరుపుతుండగా, ఎంతో ధైర్యసాహసాలతో ఎదుర్కొన్నారు. భైరో వీరోచితంగా ఎల్ఎంజీతో 7 గంటలపాటు కాల్పులు జరిపారు. దాదాపు 25 మంది పాకిస్తానీ సైనికులను మట్టుబెట్టారు. ఆయన సేవలకు గుర్తింపుగా రాజస్థాన్ ప్రభుత్వం 1972లో ఆయనను సేనా పతకంతో సత్కరించింది. 1977లో వచ్చిన హిందీ సినిమా “బోర్డర్” లో ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి..భైరో సింగ్ రాఠోడ్‌ పాత్రలో నటించారు.

ఇక, సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) 57వ రైజింగ్‌ డే వేడుకలు ఆదివారం ఉదయం జైసల్మేర్‌లో ఘనంగా నిర్వహించారు. తొలిసారిగా ఢిల్లీకి ఆవల జరిగిన బీఎస్‌ఎఫ్‌ రైజింగ్‌ డే ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన అమిత్‌షా… బీఎస్‌ఎఫ్‌ గార్డ్ ఆఫ్ ఆనర్‌ను స్వీకరించారు. బీఎస్ఎఫ్ టోపీ ధరించిన అమిత్‌షా.. ఆర్మీ జవాన్లతో ముచ్చటిస్తూ సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. ఈ ఉత్సవాలకు మరో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ కూడా హాజరయ్యారు. అమిత్‌షా, షెకావత్‌కు బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ పంకజ్‌ సింగ్‌ సాదరంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా..”యాంటీ డ్రోన్ టెక్నాలజీని భారత్ అభివృద్ధి చేస్తోంది. త్వరలోనే ఇది భద్రతా బలగాలకు అందించబడుతుంది. బీఎస్ఎఫ్..ఢిఫెన్స్ మొదటి లైన్. మా ప్రభుత్వానికి బోర్డర్ సెక్యూరిటీ అంటే జాతీయ భద్రత అని అర్థం. బీఎస్ఎఫ్ కి వరల్డ్ క్లాస్ టెక్నాలజీని అందించేందుకు కట్టుబడి ఉన్నాం”అని తెలిపారు.

ALSO READ Aayushman Bharat Scheme : ఆర్మీకి కూడా ఆయుష్మాన్ భారత్ పతకం వర్తింపు