ఢిల్లీ అల్లర్లలో గాయపడ్డ పోలీసులను పరామర్శించిన అమిత్ షా

ఢిల్లీ అల్లర్లలో గాయపడ్డ పోలీసులను పరామర్శించిన అమిత్ షా

Amit Shah నూతన వ్యవసాయ చ‌ట్టాల‌ను వ్యతిరేకిస్తూ రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ హింసాకాండలో ఓ రైతు మరణించగా.. 394మంది పోలీసులు గాయపడ్డారు. చాలా మంది తీవ్రంగా గాయపడి ఢిల్లీలోని పలు హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నాం షుష్రత్ ట్రామా సెంటర్ మరియు తీరథ్ రామ్ షా హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్న పోలీసులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరామర్శించారు.

అమిత్ షా తో పాటు కేంద్ర హోం సెక్రటరీ అజయ్ భల్లా,ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్నీవాత్సవ కూడా ఉన్నారు. గాయపడిన పోలీసులను పరామర్శించిన అమిత్ షా.. వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పోలీసుల ఆరోగ్యం గురించి డాక్టర్లను కూడా అడిగి తెలుసుకున్నారు షా. ఈ సందర్భంగా ర్యాలీలో జరిగిన అవాంఛనీయ సంఘటనల గురించి షా పోలీసులను ఆరా తీసినట్లు సమాచారం.

ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన హింస నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని సరిహద్దు ప్రాంతాల్లో, నగరంలో భారీగా పోలీసులను మోహరించారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై క్రైం బ్రాంచ్ పోలీసులు 22 కేసులు నమోదు చేసి దర్యాప్తు సైతం ప్రారంభించారు. ఇప్పటికే 20మంది రైతు సంఘాల నాయకులకు లుక్ ఔట్ నోటీసులు జారీచేశారు.