అత్యంత తీవ్రమైనదిగా మారుతున్న ఆంఫన్ తుఫాన్

  • Published By: venkaiahnaidu ,Published On : May 19, 2020 / 01:37 PM IST
అత్యంత తీవ్రమైనదిగా మారుతున్న ఆంఫన్ తుఫాన్

సూపర్ సైక్లోన్ “ఆంఫన్” రేపు(మే-20,2020) బెంగాల్ లో తీరం దాటే సమయంలో “అత్యంత తీవ్రమైన”తుఫాన్ గా మారనుందని ఇవాళ NDRF(National Disaster Response Force)చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. కరోనా, అంఫన్‌ తుపానులతో రెండు సవాళ్లను ఎదుర్కొంటున్నామని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ చీఫ్‌ ఎస్‌ఎన్ ప్రధాన్ అన్నారు.

అంఫన్‌ తుపాను అతి తీవ్రంగా మారిన నేపథ్యంలో తమ బృందాలను బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలకు పంపించినట్టు చెప్పారు. ఏ విధమైనా ఎమర్జెన్సీ పరిస్థితిని అయినా డీల్ చేయడానికి పశ్చిమ బెంగాల్‌,ఒడిషా రాష్ట్రాల్లో 40 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు మొహరించినట్టు తెలిపారు. ఈ అంఫన్‌ తుఫాన్…1999లో ఒడిషా తీరాన్ని ఊపేసిన తుఫాను లాంటిదేనని ఆయన అన్నారు. బంగాళాఖాతంలో రెండు దశాబ్దాల్లో ఇది రెండో అత్యంత తీవ్రమైన తుఫాన్ అని తెలిపారు. 

మరోవైపు తుఫాను నేపథ్యంలో గురువారం ప్రత్యేక శ్రామిక్ రైళ్లను ఆపాలని తాను రైల్వేను కోరుతానని బెంగాల్ సీఎం మమత చెప్పినట్లు ప్రధాన్ తెలిపారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల్లోని 3లక్షల మందిని రిలీఫ్ సెంటర్లకు తరలించామని,ఎటువంటి పరిస్థితులు ఎదురైనా డీల్ చేసేందుకు అన్ని ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా-తనకు మధ్య ఈ విషయమై ఫోన్ సంభాషణ జరిగినట్లు ఆమె వివరించారు.

మరోవైపు ఆంఫన్ తుఫాను విషయంలో కేంద్రం నుంచి అవసరమైన అన్ని రకాల మద్దుతును అందిస్తామన్నారు ప్రధాని మోడీ. అయితే ఆంఫన్ తుఫాన్ క్రమంగా బలహీనపడుతుందని,ఒడిషాలో దీని ప్రభావం తీవ్రంగా ఉండకపోవచ్చునని ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్(IMD)డైరక్టర్ జనరల్ మృత్యుంజయ్ మొహపాత్ర తెలిపారు. అయితే కేంద్రపరా,బాలాసోర్,భద్రక్,జగత్ సింగ్ పూర్ వంటి తీరప్రాంత జిల్లాల్లో బలమైన గాలులతో అధికవర్షాలు కురుస్తాయని తెలిపారు.

ప్రస్తుతం సముద్రంలో గంటకు 200-240కిలోమీటర్ల వేగంతో గాలి వేగం ఉందని మొహపాత్ర  తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలతో పాటు కోల్‌కతా, హుగ్లీ, హౌరా ప్రాంతాల్లో ‘అంఫన్‌’ తుపాను తీవ్రత ఉండే అవకాశముందన్నారు. ప్రస్తుతం ఒడిషాలోని,బెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులతో భారీ వర్షాలు పడుతున్నాయి.