Operation Amritpal: పరారీలోనే అమృత్‌పాల్.. నేపాల్‌లో హై అలర్ట్.. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పటిష్ట నిఘా..
ఖలిస్థాన్ వేర్పాటు వాద గ్రూపుకు చెందిన అమృత్‌పాల్ సింగ్‌ను నిఘా జాబితాలో చేర్చాలని భారత రాయబార కార్యాలయం నేపాల్ ప్రభుత్వాన్ని కోరింది. భారత రాయబార కార్యాలయం అభ్యర్ధన మేరకు నేపాల్ ఇమ్మిగ్రేషన్ విభాగం అమృత్‌పాల్ సింగ్‌ను నిఘా జాబితాలో చేర్చినట్లు ఖాట్మండులోని అధికారులు తెలిపారు.

Amritpal
Operation Amritpal: ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూనే ఉన్నాడు. గత కొద్దిరోజులుగా అమృత్‌పాల్ కోసం పంజాబ్ పోలీసులు (Punjab Police) జల్లెడ పడుతున్నారు. అయినా, మారు వేషాల్లో నిందితుడు తప్పించుకొని తిరుగుతున్నాడు. అతను పంజాబ్ సరిహద్దులతో పాటు భారతదేశం సరిహద్దులు దాటి నేపాల్‌కు వెళ్లినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే నేపాల్, భారత్ సరిహద్దు (Border of Nepal and India) ల్లో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినప్పటికీ.. మారువేషంలో తప్పించుకొని నేపాల్‌లోకి ప్రవేశించాడని తెలుస్తోంది. భారత ప్రభుత్వం ఈ మేరకు నేపాల్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖలో ఖలిస్థాన్ వేర్పాటు వాది అమృత్‌పాల్ భారత్ నుంచి పారిపోయి నేపాల్ (Nepal)లో అడుగు పెట్టినట్లు సమాచారం ఉందని, అతనికోసం వెతుకులాట ప్రారంభించాలని భారత ప్రభుత్వం కోరింది.
Amritpal Singh: మరో కొత్త వేషంలో అమృత్‌పాల్ సింగ్.. సీసీ టీవీ ఫుటేజ్ లభ్యం
ఖలిస్థాన్ వేర్పాటు వాద గ్రూపుకు చెందిన అమృత్‌పాల్ సింగ్‌ను నిఘా జాబితాలో చేర్చాలని భారత రాయబార కార్యాలయం నేపాల్ ప్రభుత్వాన్ని కోరింది. భారత రాయబార కార్యాలయం అభ్యర్ధన మేరకు నేపాల్ ఇమ్మిగ్రేషన్ విభాగం అమృత్‌పాల్ సింగ్‌ను నిఘా జాబితాలో చేర్చినట్లు ఖాట్మండులోని అధికారులు తెలిపారు. అమృత్‌పాల్ సింగ్‌ను నేపాల్ గుండా మరో దేశానికి వెళ్లడానికి వీలులేకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటుచేయాలని భారత్ విజ్ఞప్తి మేరకు నేపాల్ భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. నేపాల్ రాయబార కార్యాలయం నేపాల్ భద్రతా సిబ్బందికి అమృత్‌పాల్ విభిన్న చిత్రాలనుకూడా పంచుకుంది. అమృత్‌పాల్ తన పాస్‌పోర్ట్ పై, మరేదైనా నకిలీ పాస్‌పోర్ట్‌పై ఇతర దేశాలకు ప్రయాణించవచ్చని భారత రాయబార కార్యాలయం తన లేఖలో పేర్కొనడంతో నేపాల్ నుంచి దుబాయ్, ఖతార్, సింగపూర్, బ్యాంకాక్ వంటి దేశాలకు అమృత్‌పాల్ పారిపోయే అవకాశం లేకుండా ఎయిర్ పోర్టులు, ఇతర ప్రాంతాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. ఆయా ప్రాంతాలకు వెళ్లే రహదారుల్లో అడుగడుగునా నేపాల్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
భారత నిఘా సంస్థ వివరాల ప్రకారం.. నేపాల్ ప్రభుత్వం అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచింది. భారతదేశం నుంచి వచ్చే వ్యక్తుల గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తోంది. మరోవైపు ఖాట్మాండులోని అంతర్జాతీయ విమానాశ్రయం, భైరహవాలోని గౌతమ్ బుద్ద అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కూడా హై అలర్ట్ ప్రకటించారు. పరారీలో ఉన్న అమృత్‌పాల్ ఫొటోను నేపాల్‌లోని అన్ని హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, లాడ్జీల నిర్వాహకులకు అందించి అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని అక్కడి భద్రతా సిబ్బంది సూచించారు. ఇదిలాఉంటే అమృత్‌పాల్ మరో సన్నిహిత అనుచరుడు వీరేందర్ సింగ్ అలియాస్ ఫాజీని అమృత్సర్ పోలీసులు అరెస్టు చేశారు.