ఊరి కోసం 30 ఏళ్లు కష్టపడి 3కి.మీ కాలువ తవ్విన రైతు…ట్రాక్టర్ గిఫ్ట్ గా ఇచ్చిన ఆనంద్ మహింద్రా

  • Published By: venkaiahnaidu ,Published On : September 20, 2020 / 09:54 PM IST
ఊరి కోసం 30 ఏళ్లు కష్టపడి 3కి.మీ కాలువ తవ్విన రైతు…ట్రాక్టర్ గిఫ్ట్ గా ఇచ్చిన ఆనంద్ మహింద్రా

తన ఊరి కోసం ఏకంగా 30 ఏళ్లు శ్రమించి.. 3 కి.మీ. కాలువ తవ్వి.. చెరువును నింపిన బీహార్ రైతు లంగీ భుయాన్ ‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. లంగీ భుయాన్ ‌ గొప్పతనంపై ట్విటర్ వేదికగా ఆనంద్ మహింద్రా కూడా స్పందించారు. గ్రామం కోసం అయన ఎంతో కష్టపడ్డారని ప్రశంసలు కురిపించారు. తన దృష్టిలో లంగీ భయాన్ తవ్విన కాలువ.. ఈజిప్ట్ పిరమిడ్, తాజ్ మహల్ కన్నా తక్కువ మహిమాన్వితమైనదేమీ కాదు అని మహింద్రా ట్వీట్ చేశారు.


ఆయన కృషికి చిరు కానుకగా ట్రాక్టర్‌ ఇవ్వనున్నట్టు సోషల్ మీడియా వేదికగా మహింద్రా ప్రకటించారు. ఈ పెద్దాయనకు తమ మహింద్రా ట్రాక్టర్‌ ను అందించడం గౌరవంగా భావిస్తామని ఆనంద్ మహింద్రా తెలిపారు. అయన ట్వీట్ చేసిన కొద్దిసేపటికి మహింద్రా కంపెనీ ప్రతినిధులు ఆ రైతుకు ట్రాక్టర్ ను అందజేశారు.

బిహార్‌లోని గయ ప్రాంతంలోని కొథిల్వా గ్రామంలోని పొలాలకు మూడు కిలోమీటర్ల అవతల కొండలున్నాయి. అక్కడ వర్షపు నీరు పడుతున్నా అది వేరే నదికి వెళ్తోందే తప్ప ఊళ్లోని పొలాలకు రావట్లేదు. నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న రైతుల పరిస్థితిని చూసి.. ఎలాగైనా సరే ఆ నీటిని తమ ఊరికి చేర్చాలని నిర్ణయించుకున్నాడు లంగీ భుయాన్. తానే స్వయంగా కాలువ తవ్వకానికి పూనుకున్నాడు.


రోజూ కొండల దగ్గరున్న అడవికి వెళ్లి.. పశువుల్ని అక్కడ వదిలి… కాలువ తవ్వకం చేపట్టేవాడు భుయాన్. అతనితో కలిసి ఆ కాలువ తవ్వకానికి ఎవరూ ముందుకు రాలేదు. ఊళ్లో వాళ్లంతా… సిటీలకు వెళ్లి, ఏదో ఒక పని వెతుక్కున్నారు. భుయాన్ మాత్రం ఉన్న ఊరినే పచ్చగా కళకళలాడేలా చేయాలనుకున్నాడు. ఊళ్లో ఓ చెరువు ఉంది. అందులో నీళ్లు లేవు. ఏకంగా 30 ఏళ్లు శ్రమించి.. 3 కి.మీ. కాలువ తవ్వి వర్షం నీరును ఊరి చెరువుకు తరలించాడు.


భుయాన్ కృషితో ఇప్పుడా చెరువు నిండిపోయింది. ఇప్పుడు అక్కడి రైతులు చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఊళ్లో పశువులకు కూడా ఆ నీరే ఉపయోగపడుతోంది. అధికారులో, ప్రభుత్వమో ఆ పని చెయ్యాలని పట్టుపట్టకుండా తానే కాలువ తవ్వి చెరువును నింపిన లంగీ భుయాన్ ‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.