అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఛిద్రమైన పేగులు

  • Published By: madhu ,Published On : February 28, 2020 / 07:48 AM IST
అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఛిద్రమైన పేగులు

ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 400 కత్తిపోట్లు..కసితీరా పొడిచి పొడిచి చంపేశారు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్‌శర్మని. ఈ కేసులో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంకిత్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్‌ చేసిన వైద్యులు నిర్ఘాంతపోతున్నారు. ఇంత దారుణంగా చంపుతారా అని నివ్వెరపోతున్నారు. అంకితశర్మ శరీరంపై ఒకటి కాదు రెండు కాదు… 4వందలకు పైగా కత్తిపోట్లున్నాయి.

శరీరంలోని ఏ భాగాన్నీ వదల్లేదు. ప్రతిభాగంలోనూ కత్తిపోట్లున్నాయి. నాలుగు నుంచి ఆరు గంటల పాటు చిత్రహింసలు పెట్టి అతడ్ని చంపి ఉంటారని పోస్ట్‌మార్టమ్ నివేదిక చెబుతోంది. ఐదారుగురు కలిసి ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని అంచనా వేస్తోంది. కత్తులు, పదునైన వస్తువులతో పొడిచి ఉంటారని భావిస్తున్నారు. ఇన్నేళ్లుగా ఇంత ఘోరంగా చంపడాన్ని తాము ఎక్కడా చూడలేదని పోస్ట్‌మార్టమ్‌ చేసిన వైద్యులు చెబుతున్నారు. 

విధి నిర్వహణలో భాగంగా 2020, ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం సాయంత్రం అల్లర్లు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లిన అంకిత్‌శర్మ తిరిగిరాలేదు. తర్వాత అతడి మృతదేహాన్ని చాంద్‌బాగ్‌ ప్రాంతంలోని ఓ డ్రైనేజీలో అతడి మృతదేహం దొరికింది. తాహీర్‌హుస్సేన్‌ అనుచరులే  ఈ దారుణానికి తెగబడినట్లుగా అనుమానిస్తున్నారు. అంకిత్‌శర్మ తండ్రి కూడా గతంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలోనే పని చేశారు. 

అల్లకల్లోలంగా మారిన ఉత్తర, ఈశాన్య ఢిల్లీ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలీసుల భారీ పహారా మధ్య ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో 10 గంటలపాటు కర్ఫ్యూని సడలించడంతో జనం వీధుల్లోకి వస్తున్నారు. 4 రోజుల తర్వాత దుకాణాలు తెరుచుకున్నాయి. ఇటు చాంద్‌బాగ్‌ ప్రాంతంలో పోలీసులు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఇక శుక్రవారం ప్రార్థనలు సందర్భంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గురుగ్రామ్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. 

ఢిల్లీలో అల్లర్ల వెనుక ఉంది ఎవరు…కేవలం మతజాడ్యంతోనే రెండు వర్గాలు దాడులు చేసుకున్నాయా…లేక వాటి వెనుక రాజకీయ నేతల ప్రోద్బలం కూడా ఉందా…ఇదే ఇప్పుడు సంచలనం కలిగిస్తోన్న అంశం..దర్యాప్తు సాగేకొద్దీ బైటపడుతున్న వాస్తవాలు పరిశీలిస్తే..ఎవరైనా నివ్వెరపోవాల్సిందే..ఇంతకీ ముప్పైమందికిపైగా ప్రాణాలను బలిగొన్నది ఎవరు ? అనేది విచారణలో తేలనుంది. 

Read More : ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్