ఫలించిన ఫడ్నవీస్ మంత్రాంగం..అన్నా హజారే నిరాహార దీక్ష రద్దు

ఫలించిన ఫడ్నవీస్ మంత్రాంగం..అన్నా హజారే నిరాహార దీక్ష రద్దు

Devendra Fadnavis నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా శనివారం(జనవరి-30,2021) నుంచి మహారాష్ట్రలొని తన స్వగ్రామం రాలేగావ్ సిద్దిలో తాను నిరాహార దీక్ష చేయనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ప్రకటించిన విషయం తెలిసిందే.రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు పలికిన అన్నా హజారే.. ఈనెల 15న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. రైతులకు మద్దతుగా జనవరి చివరికి తన ‘జీవితంలో ఆఖరి నిరాహార దీక్ష’ చేస్తానని ప్రకటించారు.

అయితే తన నిర్ణయంపై అన్నాహజారే వెనక్కి తగ్గారు. నిరాహార దీక్ష ప్రణాళికను రద్దు చేసుకుంటున్నట్టు మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో శుక్రవారం అన్నాహజారే తెలిపారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి కలసి వెళ్లి శుక్రవారం అన్నాహజారేతో చర్చలు జరిపారు. నిరాహార దీక్షకు వెళ్లకుండా బుజ్జగించారు. ఆయన డిమాండ్ చేసినట్టు వ్యవసాయ శాఖ అధికారులు, నీతి ఆయోగ్‌తో పాటు అన్నా హజారే సూచించిన కొందరు సభ్యులతో ఓ కమిటీ వేయడానికి ఫడ్నవీస్, కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి హామీ ఇవ్వడంతో అన్నా హజారే తన నిరాహార దీక్షను రద్దు చేసుకున్నారు. అన్నా హజారే చేసిన డిమాండ్లను ఆ కమిటీ పరిశీలించి ఆరు నెలల్లో అమలు చేసేందుకు అంగీకరించినట్టు అన్నాహజారే కార్యాలయం ప్రకటించింది.

కాగా, డిసెంబరు 14న కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు కూడా అన్నా హజారే లేఖరాశారు. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ ప్రతిపాదనలను అమలు చేయాలని.. అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ కమిషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వాలని అందులో డిమాండ్ చేశారు. లేదంటే తాను నిరహార దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై ఇప్పటికీ ఐదు సార్లు కేంద్రానికి లేఖ రాశానని.. కానీ ఎలాంటి స్పందన లేదని అన్నా హాజరే అప్పుడు చెప్పిన విషయం తెలిసిందే.