ఫ్రీ కశ్మీర్ ప్లకార్డ్….24గంటల్లోనే మరో బెంగళూరు యువతి అరెస్ట్

  • Published By: venkaiahnaidu ,Published On : February 21, 2020 / 03:39 PM IST
ఫ్రీ కశ్మీర్ ప్లకార్డ్….24గంటల్లోనే మరో బెంగళూరు యువతి అరెస్ట్

బెంగళూరులో మరో యువతి అరెస్ట్ అయింది. చిక్కమంగళూరుకి చెందిన 19ఏళ్ల అమూల్య లియోనా  బెంగళూరులో గురువారం(ఫిబ్రవరి-20,2020)సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’జరిగిన సభలో  ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’నినాదాలు చేసి కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో వేదికపై ఉన్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, కార్యక్రమ నిర్వాహకులు విస్తుపోయారు. అనంతరం ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే ఈ ఘటన జరిగిన 24గంటల్లోనే మరో బెంగళూరు యువతి కశ్మీర్‌కు,ముస్లింలకు విముక్తి కావాలంటూ ప్లకార్డు ప్రదర్శించి అరెస్ట్ అవడం కలకలం రేపుతోంది. శుక్రవారం(ఫిబ్రవరి-21,2020) బెంగళూరులోని టౌన్‌హాల్‌ వద్ద వివిధ కన్నడ సంఘాలు సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించాయి. ఇందులో పాల్గొన్న ఆరుద్ర అనే యువతి కశ్మీర్‌కు విముక్తి కావాలని ప్లకార్డులు ప్రదర్శించింది. ‘ముస్లింలు, దళితులు, కశ్మీర్, బహుజన్, ఆదివాసీలు, ట్రాన్స్‌జెండర్లకు విముక్తి కావాలి’అని ప్లకార్డుపై రాసి ప్రదర్శించింది.

వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని సంపంగిరామనగర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని నినదించిన అమ్యూలకు ఆరుద్ర ఫేస్‌బుక్ ఫ్రెండ్ అని పోలీసులు తెలిపారు. తాను మల్లేశ్వరం కాలేజీ విద్యార్థినని ఆరుద్ర చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

మరోవైపు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన అమూల్య లియోనాకు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని కర్ణాటక సీఎం శుక్రవారం యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. అమూల్య వంటి  వ్యక్తుల వెనుక ఉన్నగ్రూప్ లు, అముల్య మాదిరిగా పెరుగుతున్న వ్యక్తులు …. వారిపై చర్యలు తీసుకోవాలి మరియు వారిని సరిగా విచారించాలి. ఆమెకు ఎవరు మద్దతు ఇస్తున్నారో అప్పుడు తెలుస్తుంది. ఆమెకు నక్సల్స్‌తో సంబంధాలున్నాయనడానికి రుజువు ఉంది. ఆమెను శిక్షించాలి మరియు ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలి అని యడియూరప్ప తెలిపారు. అమూల్య తండ్రి మాట్లాడుతూ…నా కూతరు పెద్ద తప్పు చేసింది. కొంతమంది ముస్లింలతో చేరి నా మాట వినడం లేదు అని ఆయన తెలిపారు.