bomb threat case against Ambani : అంబానీకి బాంబు బెదిరింపుల కేసులో మరో ట్విస్ట్ : పీపీఈ కిట్ వేసుకుంది సచిన్ వాజేనేనని తేల్చిన ఎన్‌ఐఏ

పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ సంచలన విషయాలు వెల్లడించింది. పీపీఈ కిట్‌ ధరించిన వ్యక్తి వాజేనేనని ఎన్ఐఏ తేల్చింది.

bomb threat case against Ambani : అంబానీకి బాంబు బెదిరింపుల కేసులో మరో ట్విస్ట్ : పీపీఈ కిట్ వేసుకుంది సచిన్ వాజేనేనని తేల్చిన ఎన్‌ఐఏ

Bomb Threat Case Against Ambani

bomb threat case against Ambani : పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ సంచలన విషయాలు వెల్లడించింది. పీపీఈ కిట్‌ ధరించిన వ్యక్తి వాజేనేనని ఎన్ఐఏ తేల్చింది. ఫిబ్రవరి 25న అంబానీ ఇంటి వద్ద ఓ అనుమానితుడు స్కార్పియో కారును పార్క్ చేశాడు. అయితే మొదటి నుంచి ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ మాజీ హెడ్ సచిన్ వాజేనే పీపీఈ కిట్‌లో ఉన్నట్లు ఎన్‌ఐఏ నిర్థారణకు వచ్చింది.

ముంబైలోని క్రైమ్ ఇంటలిజెన్స్ యూనిట్‌లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక ల్యాప్‌టాప్, ఐప్యాడ్, ఫోన్, డిజిటల్ వీడియో రికార్డర్‌తో పాటు థానేలోని సచిన్ వాజే నివాసానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. అయితే ల్యాప్‌టాప్‌లోని డేటాను సచిన్‌ వాజే డిలీట్‌ చేసినట్లు ఎన్ఐఏ తేల్చింది. మొబైల్‌ ఫోన్‌ను కూడా వాజేనే కావాలని పారేసినట్లు వెల్లడించింది.

మరోవైపు సచిన్ వాజే బ్లాక్ మెర్సిడెజ్ కారును ఎన్ఐఏ అధికారులు సీజ్ చేశారు. అంతేకాదు.. అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన స్కార్పియో వాహనం ఒరిజినల్ నంబర్ ప్లేటును కూడా ఇదే మెర్సిడెజ్ కారులో గుర్తించారు. దీంతో సచిన్‌ వాజేనే ఈ కుట్ర వెనుక ఉన్నాడన్న ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయింది. సచిన్ వాజేకి చెందిన మెర్సిడెజ్‌ కారులో 5 లక్షల రూపాయల నగదు, కొన్ని దుస్తులు, డీజిల్, కరెన్సీ కౌంటింగ్ మెషీన్‌ను ఎన్ఐఏ గుర్తించింది. ప్రస్తుతం ఈ కారును సచిన్ వాజే ఉపయోగిస్తున్నప్పటికీ… దాని అసలు యజమాని వేరే ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతని వివరాల కోసం ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.

ఫిబ్రవరి 25న ముంబైలోని అంబానీ నివాసం అంటిల్లాకు సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియో వాహనం కలకలం రేపింది. ఆ స్కార్పియో డెకార్‌ షాపు యజమాని మన్సుఖ్‌ హిరాన్ దగ్గర ఉండేది. అతను అనుమానాస్పద స్థితిలో చనిపోవడం ఈ కేసులో పెద్ద ట్విస్ట్. శ్యామ్ న్యూటన్ అనే వ్యక్తి కారుకు కొన్ని భాగాలు అమర్చాల్సిందిగా.. తన డెకార్‌ షాపులో స్కోర్పియో అప్పగించినట్లు చనిపోక ముందు మన్సుఖ్‌ పోలీసులకు తెలిపాడు. అయితే డబ్బులు చెల్లించని కారణంగా ఆ కారును తననే వాడుకోమని న్యూటన్‌ చెప్పడంతో హిరానే ఆ వాహనాన్ని ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత గతేడాది నవంబర్ నుంచి ఫిబ్రవరి 5 వరకూ సచిన్‌ వాజే ఈ స్కార్పియోను వాడుకున్నాడు.

ఫిబ్రవరి 5న మన్సుఖ్‌కు వాహనం తిరిగివ్వగా… ఆ తర్వాత 12 రోజులకు చోరీకి గురైంది. అంతేకాదు, వాజేనే తన భర్తను హత్య చేసి ఉండవచ్చని మన్సుఖ్‌ భార్య విమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటితో పాటుగా ఇప్పుడు సచిన్ వాజే బ్లాక్ మెర్సిడెజ్ కారులో స్కార్పియో వాహనం ఒరిజినల్ నంబర్ ప్లేటు ఉండడంతో పాటు పీపీఈ కిట్‌లో ఉంది వాజేనేనని తేలడం సంచలనం రేపుతోంది. ఇలా ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతున్న ఈ కేసు చివరకు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.