రైతు దినోత్సవంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు

దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టారని సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది.
వ్యవసాయం, రైతు సంక్షేమానికి ఆయన తీసుకున్న చర్యలు విప్లవాత్మకమైనవి అని అందుకే రాజశేఖర్ రెడ్డి స్మారకంగా ప్రతి ఏడాది జూలై 8వ తేదీని రైతు దినోత్సవంగా ప్రకటిస్తున్నట్లు ఆ ఉత్తర్వులలో వెల్లడించింది ప్రభుత్వం.
జాతీయ రైతు దినోత్సవాన్ని ప్రతి ఏటా డిసెంబర్ 23వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. భారత మాజీ ప్రధాని చరణ్‌సింగ్ పుట్టిన రోజైన డిసెంబర్ 23న రైతు దినోత్సవం నిర్వహిస్తారు. చౌదరి చరణ్ సింగ్ భారతదేశానికి 5 వ ప్రధాని. చరణ్ సింగ్ చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందారీ చట్టం రద్దై, కౌలు దారీ చట్టం అమలులోకి వచ్చింది. రైతులకు బ్యాంక్ ఋణాలు అందించే విధానము ప్రవేశపెట్టబడింది.