కరోనాపై పోరులో భారత్ కి యాపిల్ సాయం

కరోనాపై పోరులో భారత్ కి యాపిల్ సాయం

Apple Ceo Tim Cook Pledges Support To India Amid Devastating Covid Crisis

APPLE CEO కరోనా సెకండ్ వేవ్ తో తల్లడిల్లిపోతున్న భారత్ కు సాయమందించేందుకు ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు గూగుల్,ఇన్ఫోసిస్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. భారత్‌లో పరిస్థితులను చూసి తన గుండె బద్దలైందన్న మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల.. ఆక్సిజన్‌ కాన్సంట్రేషన్‌ యంత్రాల కొనుగోలుకు చేయూతనిస్తామని ప్రకటించగా,సహాయక చర్యల నిమిత్తం భారత్ కు రూ.135 కోట్ల విరాళం అందిస్తున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ప్రకటించారు.

తాజాగా భారత్ కు సాయమందించేందుకు యాపిల్ కంపెనీ ముందుకొచ్చింది. యాపిల్ సీఈఓ టిమ్​ కుక్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్​లో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండటం వల్ల వైద్యులు, కార్మికులు, యాపిల్ కుటుంబం సహా భయంకరమైన ఈ మహమ్మారితో పోరాడుతున్న ప్రతి ఒక్కరిపైనే మా ఆలోచనలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలకు మద్దతుగా యాపిల్ విరాళం ఇవ్వనుంది అని టిమ్‌ కుక్‌ ట్విట్టర్​ వేదికగా ప్రకటించారు.

అయితే, ఏ రూపంలో, ఎంత మొత్తంలో సాయం చేయనున్నారనే దానిపై యాపిల్‌ నుంచి ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. స్వచ్ఛంద సంస్థలు లేదా ప్రభుత్వానికే నేరుగా విరాళం అందించడంపై వివిధ వర్గాలతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక, ఇండియాకు అండ‌గా నిల‌వ‌డానికి అమెరికాకు చెందిన 40 టాప్ కంపెనీల సీఈవోలు కూడా ఏక‌మ‌య్యారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌త్యేకంగా ఓ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి మ‌రీ ఇండియాకు సాయం చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.