అయోధ్య కేసులో ముగిసిన వాదనలు..తీర్పుకి సుప్రీం రెడీ

  • Published By: venkaiahnaidu ,Published On : October 16, 2019 / 10:44 AM IST
అయోధ్య కేసులో ముగిసిన వాదనలు..తీర్పుకి సుప్రీం రెడీ

అయోధ్య కేసులో సుప్రీం కోర్టులో ఇవాళ(అక్టోబర్-16,2019) వాదనలు ముగిశాయి. డెడ్ లైన్ కంటే గంట ముందే వాదనలు ముగిశాయి. తీర్పుని కోర్టు రిజర్వ్ లో ఉంచింది. ఇంకా ఏదైనా చెప్పదల్చుకుంటే లిఖితపూర్వక వాదనలు వినిపించేందుకు 3రోజులు సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు. చివరి రోజు విచారణ సందర్భంగా వాడీవేడిగా వాదనలు ముగిశాయి. 40రోజులుగా సుప్రీంకోర్టులో ఈ కేసుపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం రోజువారీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. 

చివరి రోజు సుప్రీంకోర్టులో హైడ్రామా చోటు చేసుకుంది. విచారణ సందర్భంగా ముస్లిం సంస్థల తరఫు లాయర్ రాజీవ్ ధావన్ అయోధ్య రామజన్మ స్థానం అంటూ  తన వాదనకు మద్దతుగా హిందూ మహాసభ న్యాయవాది వికాస్ సింగ్ కోర్టులో చూపిన ఓ పుస్తకాన్ని చించేశారు. దీనిపై కోర్టులో పెద్ద రచ్చ జరిగింది. అయితే రాజీవ్ ధవన్ తన చర్యను సమర్థించుకున్నారు. సీజేఐ చెప్పడంతోనే తాను చింపివేసినట్లు ఆయన తెలిపారు. సీజేఐ కూడా దీనిని అంగీకరించారు.

అయితే శాంతి భద్రతల దృష్యా అయోధ్య నగరంలో ఇప్పటికే 144 సెక్షన్ ను విధించారు. అయోధ్యపై సుప్రీం తీర్పుతోపాటు బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం ఉన్న సందర్భంగా డిసెంబర్-10,2019వరకు అయోధ్యలో 144 సెక్షన్ నిషేధ ఉత్తర్వులు విధిస్తున్నట్లు అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ అనూజ్ కుమార్ ఝా తెలిపారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలం విషయంలో సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా పౌరుల భద్రత కోసం 144 సెక్షన్ ను అమలు చేస్తున్నామని తెలిపారు. అయోధ్యలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించారు. అయోధ్యలో తీర్పు అనంతరం బాణసంచా కాల్చకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీపావళి పండగ సందర్భంగా కూడా బాణసంచాను విక్రయించకుండా చర్యలు తీసుకున్నారు.

అయోధ్య వివాదం పరిష్కారం కోసం ఏర్పాటైన మధ్యవర్తిత్వ కమిటీవివాదానికి స్నేహపూర్వక పరిష్కారం కనుగొనడంలో విఫలమైన అనంతరం భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 6 నుంచి ఈ కేసుపై రోజువారీ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ నవంబర్ 17న పదవీ విరమణ చేయనుండగా, అప్పటిలోగా ఈ మైలురాయి కేసులో ధర్మాసనం తన తీర్పును ఇస్తుందని అందరూ భావిస్తున్నారు.