తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా బిపిన్ రావత్

  • Published By: venkaiahnaidu ,Published On : December 30, 2019 / 11:12 AM IST
తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా బిపిన్ రావత్

భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్(CDS)గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ను కేంద్రప్రభుత్వం ఖరారు చేసింది. డిసెంబ‌ర్ 31,2019న ఆర్మీ చీఫ్‌గా రావ‌త్ రిటైర్‌ కానున్నారు. ఈ నేప‌థ్యంలో బిపిన్ రావత్ పేరును చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ప్రకటించడం విశేషం.  త్రివిధ దళాలను సమన్యయపరిచే చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌ పోస్టును తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా మోడీ చెప్పిన విషయం తెలిసిందే. 

ఈ సూచన గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉంది. 1999 కార్గిల్ సంక్షోభం తర్వాత అత్యున్నత మిలటరీ పోస్టును క్రియేట్ చేయాలని అప్పటి కమిటీ సూచించిన విషయం తెలిసిందే. ఈనెల 24న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్టును ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసింది. అంతేకాదు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ బాధ్యతలు ఇతర వ్యవహారాలపై కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్టుకు ఇండియన్ ఆర్మీ, లేదా ఇండియన్ నేవీ, లేదా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ నుంచి నాలుగు నక్షత్రాలు కలిగి ఉన్న అధికారిని నియమించడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు సంబంధించిన నిబంధనలను సవరించింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా నియమించబడ్డ వ్యక్తి 65 ఏళ్ల వరకు ఆ స్థానంలో కొనసాగుతారని స్పష్టం చేసింది.  

త్రివిధ దళాధిపతులను సీడీఎస్ డైరక్ట్ చేస్తాడు .ప్రభుత్వానికి సింగిల్ పాయింట్ సైనిక సలహాదారుగా సిడిఎస్ ఉంటారు.ఆయుధాల కొనుగోలు, శిక్షణ, సిబ్బంది, మిలటరీ కమాండ్ల వ్యవస్థలో మార్పులు చేర్పులు వంటివి నిర్వర్తిస్తారు. మొత్తంగా త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు కార్యక్రమాలు చీఫ్ ఆఫ్ ఢిఫెన్స్ స్టాఫ్ నేతృత్వంలోనే జరుగుతాయని తెలుస్తోంది. ఇకపై ఆయుధాల కొనుగోలు విషయంలో నిధులు దుర్వినియోగం కాకుండా చూసే బాధ్యత కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌పై ఉంటుంది.