మోడీ ప్రశంస : జై జవాన్.. భారీ మంచులో గర్భిణికి సాయం!

  • Published By: sreehari ,Published On : January 15, 2020 / 09:53 AM IST
మోడీ ప్రశంస : జై జవాన్.. భారీ మంచులో గర్భిణికి సాయం!

కశ్మీర్ లోయలో భారీగా మంచు కురుస్తోంది. ఓ మహిళ ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతోంది. నిండు గర్భిణికి సాయం చేసేందుకు భారత సైనికులు ముందుకొచ్చారు. జాతీయ సైనిక దినోత్సవం సందర్భంగా భారత ఆర్మీ అధికారులు గర్భిణిని ఓ స్ట్రచర్ పై తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కశ్మీర్ లోయలో హిమపాతం కురుస్తున్నప్పటికీ ప్రాణాలు లెక్క చేయకుండా మహిళ ప్రాణాన్ని కాపాడేందుకు సైనికులు చూపించిన ధైర్యసాహాసాలను ప్రతిఒక్కరూ ప్రశంసిస్తున్నారు. 

ఈ వీడియోను చినార్ కార్ప్స్ ఇండియన్ ఆర్మీ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది. అందిన సమాచారం ప్రకారం.. షామిమా అనే మహిళ పురిటి నొప్పులు రావడంతో ఆమెను అత్యవసరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి ఇలా భారీ మంచులో స్ట్రెచర్ పై తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ‘భారీగా మంచు కురుస్తోంది. షామిమాకు అత్యవసర వైద్య చికిత్స అవసరమైంది. 

100 ఆర్మీ అధికారులు, 30 మంది పౌరులు స్ట్రెచర్ పై మహిళను నాలుగు గంటల పాటు కాలినడకన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో మహిళకు పాప పుట్టింది. తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు’ క్యాప్షన్ తో ట్వీట్‌ ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది. ఈ వీడియోలో పౌరులతో పాటు సైనికులు స్ట్రెచర్ పై మహిళను తీసుకెళ్తున్నట్టు కనిపిస్తోంది.

ట్విట్టర్ లో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన ప్రధాని నరేంద్ర మోడీ.. రీట్వీట్ చేశారు. నిండు గర్భిణి ప్రాణాలను రక్షించేందుకు సైనికుల పడిన శ్రమను మోడీ అభినందించారు. ‘మన సైనికులు ఎంతో నైపుణ్యం కలిగిన ధైర్యవంతులు. మానవతా ధృక్పథం కలిగినవారు. ప్రజలకు సాయం అవసరమైనప్పుడు మన ఆర్మీ ముందుండి సాధ్యమైనంత వరకు సాయం అందిస్తుంది. 

ఆర్మీని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. షామిమా, ఆమెకు పుట్టిన పాప ఆరోగ్యంతో వర్థిల్లాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను’ అంటూ మోడీ ట్వీట్ చేశారు. మరోవైపు నెటిజన్లు కూడా భారత సైనికులు చూపిన ధైర్య సాహాసాలను అభినందిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ వీడియోకు 65.4 వేల వ్యూస్ రాగా, 5.1 లక్షలు లైక్స్, 1.6వేల రీట్వీట్లు చేశారు.

ప్రతి ఏడాదిలో జనవరి 15న భారత దేశంలో జాతీయ సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. సైనిక దినోత్సవం రోజున న్యూఢిల్లీలోని ఇండియాగేట్‌ వద్ద దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన జవాన్లకు నివాళులు అర్పిస్తారు. ఆ తరువాత దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో సైనిక కవాతు నిర్వహిస్తారు.