అహంకారం తలకెక్కింది : తోమర్ పై ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత నిప్పులు

అహంకారం తలకెక్కింది : తోమర్ పై ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత నిప్పులు

RSS leader targets Narendra Singh Tomar : ‘అధికార మదం నేడు మీ తలకెక్కింది. ప్రజాతీర్పును ఎందుకు కోల్పోతున్నారు. కుళ్లిపోయిన కాంగ్రెస్ విధానాలను మనం ఎందుకు తలకెత్తుకోవాలి. చిల్లుపడిన కుండలో నీళ్లు ఉండవు. కుండ ఖాళీ అవుతుంది’. అంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పై ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు రఘునందన్ శర్మ నిప్పులు చెరిగారు. సాగు చట్టాలను రద్దు చేయాలంటూ..70 రోజులకు పైగా..రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రఘునందన్ శర్మ శనివారం స్పందించారు. తన అధికారిక ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా మండిపడ్డారు.

అధికార మదం తలకెక్కిందని, దేశభక్తిని పాదుకొలిపేందుకు ప్రభుత్వం శక్తియుక్తులన్నీ కేంద్రీకరించాలని లేదంటే..పశ్చాతప్తపడాలని నరేంద్ర సింగ్ తోమర్ ను ఉద్దేశిస్తూ..వెల్లడించారు. కొందరు నగ్నంగా ఉండాలని కోరుకునే వారిపై బలవంతంగా వస్త్రాన్ని కప్పితే ఏం ఉపయోగం ? మీ ఉద్దేశం రైతులకు మేలు చేసేదే అయినా.. కొందరు ఈ సాయాన్ని కోరుకోకపోవడం వల్ల అలాంటి మంచి పనిచేసి ఏం లాభం ఉంటుంది ? అంటూ నిలదీశారు. జాతీయతను బలోపేతం చేయడానికి అన్ని శక్తులను ఉపయోగించుకోండి, మా సూచనలు మీరు స్వీకరిస్తారని భావిస్తున్నాను అంటూ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.

గత కొన్ని రోజులుగా ఢిల్లీ సరిహద్దులో రైతులు ఆందోళన చేపడుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారిని కట్టడి చేసేందుకు భారీ ఎత్తున సాయుధ బలగాలు మోహరించాయి. బారికేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. అయినా..వారు వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు వ్యవసాయ చట్టాలపై వెనక్కితగ్గేది లేదని కేంద్రం చెబుతోంది.