‘ఏఐ’ బాటలో బ్యాంకులు : చిటికెలో సర్వీసులు!

  • Published By: veegamteam ,Published On : February 28, 2019 / 08:00 AM IST
‘ఏఐ’ బాటలో బ్యాంకులు :  చిటికెలో సర్వీసులు!

ఢిల్లీ : టెక్నాలజీ పుణ్యమా అని బ్యాంకుల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బ్యాంకుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ హవా నడుస్తోంది. బ్యాంకులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో కస్టమర్లకు చిటికెలో సర్వీసులను అందించాలని ప్రయత్నిస్తున్నాయి. చాట్‌బాట్స్, వాయిస్‌బాట్స్ ద్వారా సత్వర సేవలను అందించేందుకు బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రైవేట్ రంగ బ్యాంకులే దూసుకుపోతున్నాయి. 
 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, కోటక్‌ మహీంద్రా బ్యాంకు, యస్‌ బ్యాంకులు వంటి ప్రయివేటు బ్యాంకులు తమ కస్టమర్ల సేవలకు చాట్‌బాట్స్, వాయిస్‌ బాట్స్‌ను వినియోగించుకుంటున్నాయి. ఏడాదిన్నర క్రితమే బాట్స్‌ వినియోగాన్ని ప్రారంభించామని..ఇప్పటి వరకు 80 లక్షల విచారణలను పూర్తి చేశామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిజిటల్‌ హెడ్‌ నితిత్‌చుగ్‌ తెలిపారు. బ్యాంకింగ్‌ సేవలే కాక చాట్‌బాట్‌ అప్లికేషన్‌ ‘ఎవ’ ద్వారా బిల్లుల పేమెంట్స్..సినిమా టికెట్స్ బుకింగ్..ఇతర సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.

2018 ఫిబ్రవరిలో చాట్ బాట్ సేవలు ప్రారంభించామని, 16 లక్షల ప్రశ్నలకు చాట్‌బాట్‌ సమాధానాలు ఇచ్చినట్టు కోటక్‌ మహీంద్రా బ్యాంకు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పునీత్‌ కపూర్‌ తెలిపారు. 

ఆటోమేషన్ మార్గంలో ఎస్‌బీఐ
ఇక దేశీ దిగ్గజ బ్యాంక్ ఎస్‌బీఐ కూడా ఆటోమేషన్ మార్గంలోకి వస్తోంది. సియా రూపంలో చాట్‌బాట్ సేవలు ప్రారంభించగా..బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు ఇతర ప్రభుత్వ బ్యాంకులు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి.

బెనిఫిట్స్ ఇలా 
కాగా బ్యాంకింగ్ వ్యవస్థలో ఆధునిక టెక్నాలజీ వినియోగం వల్ల సేవలు సులభతరం అవుతున్నాయి. బ్యాంకుల వ్యయాలు కూడా దిగివస్తాయి. అయితే అదేసమయంలో ఉద్యోగాల తగ్గింపు కూడా ఉంటుంది.