మరోసారి ఏ మంత్రిత్వశాఖను తీసుకోని కేజ్రీవాల్…ఎందుకో తెలుసా

  • Published By: venkaiahnaidu ,Published On : February 19, 2020 / 02:55 PM IST
మరోసారి ఏ మంత్రిత్వశాఖను తీసుకోని కేజ్రీవాల్…ఎందుకో తెలుసా

ఢిల్లీ సీఎంగా మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ గత ఆదివారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలోలా ఈసారి కూడా కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2015నుంచి ఉన్నట్లుగా మరోసారి  ఏ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించకూడదని కేజ్రీవాల్ నిర్ణయించారు. ఈ నిర్ణయంతో మరోసారి ఆయన తన కేబినెట్ లో ఏ మంత్రిత్వశాఖ లేకుండా ఉన్న ఏకైక మంత్రిగా ఉంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ  ప్రతి ఇంటికి తక్కువ ధరలో నీటిని ఇస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరినందున, 2017 లో తాను చేపట్టిన నీటి మంత్రిత్వ శాఖను కూడా ఈసారి కేజ్రీవాల్ తన దగ్గర ఉంచుకోలేదు.

ఇవాళ(ఫిబ్రవరి-19,2020)ఢిల్లీలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ….ఎందుకు మీరు ఏ మంత్రిత్వశాఖను మీ దగ్గర ఉంచుకోలేదు అని చాలామంది ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం… ఢిల్లీ ప్రజలకి నా మొదటి మరియు పూర్తి కమిట్ మెంట్. ఢిల్లీ ప్రజలు నాకు పెద్ద బాధ్యతను అప్పగించారు. ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహించాలి. అందుకే నేను నా దగ్గర ఏ శాఖను ఉంచుకోలేదు. ఈ విధంగా నేను అన్ని మంత్రిత్వ శాఖలపై ఓ కన్నేసి ఉండగలను. ఒక మంత్రిత్వ శాఖలో, తక్కువ వివరాలతో చిక్కుకుపోతే మిగిలిన పని బాధపడుతుందని ముఖ్యమంత్రి వివరించారు.

ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70స్థానాల్లో 62సీట్లు గెలుచుకుని గ్రాండ్ విక్టరీ కొట్టిన తర్వాత ఆప్ అధినేత…అమిత్ షాతో తొలిసారిగా భేటీ అయిన సందర్భం ఇది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అరవింద్ కేజ్రీవాల్ పై అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆప్-అమిత్ షా ల మధ్య మాటల యుద్ధమే నడిచింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఢిల్లీలో గెలిచేందుకు అమిత్ షా చాలా గట్టిగానే ప్రయత్నించినప్పటికీ కేజ్రీవాల్ విజయాన్ని ఆపలేకపోయారు.

గత కేబినెట్ లో పనిచేసిన ఆరుగురు మంత్రులే మరోసారి కేజ్రీవాల్ తో కలిసి గత ఆదివారం మంత్రులుగా మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కేబినెట్ లో కొత్తవాళ్లకు చోటు లేదని కేజ్రీవాల్ ప్రకటించేశారు. పాతవారినే మరోసారి మంత్రులుగా కంటిన్యూ చేశారు.