మరోసారి లాక్ డౌన్ ఆలోచన లేదు…ఢిల్లీ సీఎం క్లారిటీ

  • Published By: venkaiahnaidu ,Published On : June 15, 2020 / 10:16 AM IST
మరోసారి లాక్ డౌన్ ఆలోచన లేదు…ఢిల్లీ సీఎం క్లారిటీ

దేశ రాజధాని ఢిల్లీలో  మరోసారి లాక్ డౌన్  విధించే అవకాశమే లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ లో కేసులు పెరుగుగుతున్న సమయంలో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని వస్తున్న వదంతులను కేజ్రీవాల్ కొట్టిపారేశారు. కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ లాక్ -1 కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

చాలామంది ప్రజలు ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారన్న ఊహల్లో ఉన్నారని, కానీ అలాంటి ప్రణాళికలేవీ లేవని సీఎం కేజ్రీవాల్‌  సోమవారం ట్వీట్ చేసారు. రానున్న రోజుల్లో ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే ఆలోచనేదీ లేదని తెలిపారు. ఇవాళ  ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరిగిన అల పార్టీ మీటింగ్ కి ఆమ్‌ఆద్మీపార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ హాజరై ఢిల్లీతోపాటు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దవాఖానల్లో పడకల సంఖ్య పెంచాలని కోరినట్లు కేజ్రీవాల్ తెలిపారు. 

కాగా, దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు తరువాత  అత్యధిక COVID-19 కేసులు నమోదవుతున్న మూడవ రాష్ట్రంగా  ఢిల్లీ నిలిచింది. ఢిల్లీ లో ఇప్పటి వరకు  41, 182 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 1,327 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు అమిత్‌ షా సోమవారం నార్త్‌ బ్లాక్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేరిన విషయం తెలిసిందే.

ఈ  సమయంలో దేశ రాజధానిలో నివసిస్తున్న ప్రజలందరికీ కరోనా వైరస్‌ నిర్దారణ పరీక్షలు నిర్వహించే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ తెలిపారు. నేషనల్ కాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)పరిధిలో నివసించే ప్రతీ ఒక్కరికీ కోవిడ్-19 టెస్టులు చేసేందుకు సిద్ధంగానే ఉన్నట్లు చెప్పారు. మరికొన్ని రోజుల్లో.ఢిల్లీలో ఒక్క  రోజుకు జరిగే కరోనా వైరస్ పరీక్షలు 18,000 కు చేరుకుంటాయని హోంమంత్రి అమిత్ షా  తెలిపారు