Arvind Kejriwal : ఖట్టర్ విమర్శలకు కేజ్రీవాల్ ఘాటు రిప్లై

కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్-హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మధ్య మాటల యుద్ధం నడిచింది.

Arvind Kejriwal : ఖట్టర్ విమర్శలకు కేజ్రీవాల్ ఘాటు రిప్లై

Arvind Kejriwals Reply To Haryana Cm Ml Khattar On Vaccines Shortage Issue

Arvind Kejriwal కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్-హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. కొద్ది రోజులుగా కేంద్రప్రభుత్వ వ్యాక్సినేషన్ విధానంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాదాపు ప్రతిరోజు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం హర్యాణా సీఎం మనోహర్​లాల్​ ఖట్టర్.. కేజ్రీవాల్​పై విరుచుకుపడ్డారు. టీకా లభ్యత పెరిగేంత వరకు 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్​ పంపిణీ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఢిల్లీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై స్పందించిన హర్యాణా సీఎం.. ఇదంతా ఓ నాటకమని ధ్వజమెత్తారు. టీకా పంపిణీని సమర్థంగా చేపట్టాలని హితవు పలికారు.

వ్యాక్సినేషన్​ ఎలా చేపట్టాలో తమను చూసి నేర్చుకోవాలని కేజ్రీవాల్ కి హితవు పలికారు ఖట్టర్. కేజ్రీవాల్ పూర్తిగా రాజకీయాలకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ ఇలా రాజకీయాలు చేయరు అని ఖట్టర్ విమర్శించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీకే ఎక్కువ టీకాలు వస్తున్నాయని.. వాటిని సరిగ్గా వినియోగించుకోవాలని సూచించారు. రోజుకు 2 లక్షల మందికి డోసులు అందించి టీకా నిల్వలను మేము కూడా అయిపోయేలా చేయగలం. కానీ ప్రతిరోజు 50 నుంచి 60 వేల మందికే వ్యాక్సిన్లు అందించి.. టీకా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇలా చేస్తేనే వ్యాక్సినేషన్ సాఫీగా సాగుతుంది. కాబట్టి కేజ్రీవాల్ దీన్ని పాటించాలి అంటూ హితబోధ చేశారు ఖట్టర్. రాష్ట్రాలన్నింటికీ కేంద్రం సమ న్యాయం చేస్తోందన్న ఖట్టర్.. తమ రాష్ట్రంలో 2.9 కోట్ల జనాభా ఉన్నప్పటికి తాము 58 లక్షల డోసుల టీకాలను మాత్రమే అందుకున్నట్టు చెప్పారు.

అయితే హర్యానా సీఎం విమర్శలపై కేజ్రీవాల్ అంతే ఘాటుగా స్పందించారు. తమ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడాలనుకుంటోందని, టీకాలను కాదని చురకలు అంటించారు. ఈ మేరకు సోమవారం కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేశారు. ఖట్టర్ సాబ్, టీకాలు మాత్రమే ప్రజల ప్రాణాలు కాపాడతాయి. వ్యాక్సినేషన్ ఎంత త్వరగా పూర్తి చేస్తే అన్ని ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి. మా లక్ష్యం టీకాలను నిల్వ చేసుకోవడం కాదు.. ప్రాణాలను రక్షించుకోవడం అంటూ కేజ్రీవాల్ తన ట్వీట్ ద్వారా ఖట్టర్ కి ఘాటు రిప్తై ఇచ్చారు.