విమర్శలతో వెనక్కి తగ్గిన అమెరికా..భారత్ కు సాయం చేస్తామని ప్రకటన

కరోనా కేసులతో అల్లాడుతున్న భారత్ కు అండగా ఉండేందుకు పలు దేశాలు ముందుకొస్తున్నాయి.

విమర్శలతో వెనక్కి తగ్గిన అమెరికా..భారత్ కు సాయం చేస్తామని ప్రకటన

As Criticism Mounts Us Assures Help To Covid Hit India

US government కరోనా కేసులతో అల్లాడుతున్న భారత్ కు అండగా ఉండేందుకు పలు దేశాలు ముందుకొస్తున్నాయి. వైరి దేశాలుగా పేరొందిన పాకిస్తాన్, చైనా కూడా భారత్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా వైఖరిపై ప్రపంచ దేశాలన్నీ విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ కు అగ్రరాజ్య అధ్యక్షుడు జోబైడెన్ సాయం చేయడానికి చొరవ చూపకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

గతేడాది అమెరికా కరోనాతో అల్లాడిపోతోంటే ఇండియా ముందుకు వ‌చ్చి అత్యంత కీలకమయిన హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి అగ్రరాజ్యానికి సాయం చేసినా.. ఇప్పుడు అగ్ర‌రాజ్యం మాత్రం ఆ ప‌ని చేయ‌క‌పోవ‌డంపై బైడెన్ ప్ర‌భుత్వం విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. అమెరికా స్టోరేజ్‌లో ఉన్న కోట్లాది ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల‌తోపాటు అవ‌స‌రమైన ఇత‌ర కొవిడ్ మందుల‌ను కోవిడ్ సెకండ్ వేవ్ తో విలవిలలాడుతున్న భారత్,బ్రెజిల్ వంటి దేశాలకు స‌ర‌ఫ‌రా చేయాల‌ని యూఎస్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌తోపాటు అక్క‌డి చ‌ట్ట‌స‌భ‌ల ప్ర‌తినిధులు, ప్ర‌ముఖ ఇండియ‌న్‌-అమెరిక‌న్‌లు బైడెన్ ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు.

ఇక,అన్ని వైపుల నుంచి..ముఖ్యంగా సోషల్ మీడియా నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో అమెరికా దిగి వ‌చ్చింది. నష్ట నివారణ చర్యలు చేపట్టింది. భారత్‌కు, అక్కడి ఆరోగ్యశాఖ సిబ్బందికి ఎటువంటి సహాయం కావాలన్నా వెంటనే చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం(ఏప్రిల్-25,2021)ప్రకటించారు. కోవిడ్-19 మ‌హ‌మ్మారితో స‌త‌మ‌వుతున్న భారత ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటాం. భార‌త ప్ర‌భుత్వంలో ఉన్న మా భాగ‌స్వాముల‌తో క‌లిసి ప‌ని చేస్తున్నాం. భారతదేశ ప్రజలకు మరియు భారతదేశ ఆరోగ్య సంరక్షణ వీరులకు అవ‌స‌ర‌మైన అద‌న‌పు సాయాన్ని శ‌ర‌వేగంగా అందిస్తాం అని బ్లింకెన్ ట్వీట్ చేశారు. అటు వైట్‌హౌజ్ నేష‌నల్ సెక్యూరిటీ అడ్వైజ‌ర్ జేక్ స‌ల్లివాన్ కూడా దీనిపై స్పందించారు. ఇండియాలో కొవిడ్ ప‌రిస్థితుల‌పై అమెరికా తీవ్ర ఆందోళ‌న చెందుతోంది. ఇండియాలోని స్నేహితులు, భాగ‌స్వాముల‌తో క‌లిసి ప‌ని చేస్తున్నాం. కొవిడ్‌పై పోరాడుతున్న ఇండియాకు మ‌రింత సాయం చేయ‌డానికి 24 గంట‌లూ శ్ర‌మిస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు.

మరోవైపు, కరోనా వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడిసరుకుల ఎగుమతిపై అమెరికాలో నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నిషేధం తొలగించి తమకు ముడిసరుకులు అందించాలని అగ్రరాజ్యాన్ని భారత్ పలుమార్లు కోరింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సైతం స్వయంగా అమెరికా అధ్యక్షుడికి ఈ విషయమై విజ్ణప్తి చేశారు. అయితే ముందుగా అమెరికన్లకు వ్యాక్సినేషన్ చేయడమే తమ లక్ష్యమని ఆ తర్వాత ఈ విషయం గురించి ఆలోచిస్తామని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ కామెంట్ చేసింది.