భారత్ తో దోస్తీకి పాక్ రెడీ..పాత విషయాలు పాతిపెడదామన్న పాక్ ఆర్మీ చీఫ్

పాకిస్తాన్ ఆర్మీ హఠాత్తుగా శాంతిమంత్రాన్ని జపిస్తోంది. భారత్-పాక్ సంబంధాల విషయంలో గురువారం పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భారత్ తో దోస్తీకి పాక్ రెడీ..పాత విషయాలు పాతిపెడదామన్న పాక్ ఆర్మీ చీఫ్

Paksthan

Pakistan Army chief పాకిస్తాన్ ఆర్మీ హఠాత్తుగా శాంతిమంత్రాన్ని జపిస్తోంది. భారత్-పాక్ సంబంధాల విషయంలో గురువారం పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జాతీయ భద్రతా సంస్థ గురువారం ఇస్లామాబాద్ లో ఏర్పాటు చేసిన “ఇస్లామాబాద్ సెక్యూరిటీ డైలాగ్” కార్యక్రంలో పాల్గొన్న బజ్వా మాట్లాడుతూ.. భారత్-పాక్ దేశాలు పాత విషయాలను పాతిపెట్టి.. గతాన్ని మరిచిపోయి.. కలిసి ముందుకు సాగాలని అన్నారు.

ఇరు దేశాల మధ్య శాంతి నెలకొంటే ఇరు దేశాలతో పాటు దక్షిణాసియా, మధ్య ఏషియా మధ్య సంబంధాలు కూడా బాగుంటాయని వ్యాఖ్యానించారు. అయితే, రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పే దిశగా ముఖ్యంగా చర్చల కోసం కశ్మీర్ లో అనుకూల వాతావరణాన్ని భారత్ సృష్టించాలన్నారు. కశ్మీర్‌ సమస్యను పరిష్కరించకుండా సంబంధాలను మెరుగుపరుచుకోవాలని చేసే ఏ ప్రయత్నమూ ఫలించదని పేర్కొన్నారు. కశ్మీర్‌ సమస్యను శాంతియుత మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని, రాజకీయ మార్గాల ద్వారా ప్రయత్నం చేస్తే బెడిసికొట్టే అవకాశం ఉందని బాజ్వా వ్యాఖ్యానించారు.

అయితే,శాంతి చర్చల కోసం కశ్మీర్ లో ఏ విధమైన అనుకూల పరిస్థితులు సృష్టించాలన్నది బజ్వా వివరంగా చెప్పలేదు. అయితే,ఎప్పుడూ పాకిస్తాన్ జపించే మంత్రం”కశ్మీర్ లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిబంధలు అమలు”మాత్రం బజ్వా నోటి వెంట రాకపోవడం విశేషం. అంతేకాకుండా కశ్మీర్ కు ప్రత్యేకహోదా కల్పించే ఆర్టికల్-370ని భారత్ పునరుద్దరించాలని కూడా బజ్వా పేర్కొనలేదు.

భారత్ తో మెరుగైన సంబంధాలు కోరుకుంటున్నామన్న పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై శుక్రవారం పీడీపీ చీఫ్,జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మొహబూబా ముఫ్తీ స్పందించారు. ఇరు దేశాలకు.. తమ విభేదాలను పక్కనబెట్టి కశ్మీర్ సమస్యకు ఓ శాశ్వత పరిష్కారం కనుగొనడానికి ఇదొక మంచి అవకాశమని ముఫ్తీ ఓ ట్వీట్ లో తెలిపారు. ఒకరికొకరు కౌంటర్ ఇచ్చుకునేందుకు ఇరు దేశాలకు మిలటరీ బడ్జెట్ లు అధికంగా ఉన్నాయని,అయితే అవే వనరులను సాధారణ సమస్యలైన పేదరికం,విద్య,ఆరోగ్యంపై ఖర్చుచేయాలని ముఫ్తీ తెలిపారు.

మరోవైపు, జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి ఇకనుంచి కాల్పులు జరుపుకోకూడదని గత నెలలో భారత్-పాక్ దేశాల సైన్యాలు పరస్పర అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. 2003నాటి కాల్పుల విరమణ ఒప్పందం పక్కాగా అమలయ్యేలా ఇరు దేశాల సైన్యం ఓ పరస్పర అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరస్పర అంగీకారం ద్వారా నియంత్రణ రేఖ వెంబడి హింస తగ్గింది.