Asaduddin Owaisi : ముస్లిం సమాజంపై ద్వేష భావం హిందుత్వ నుంచే వచ్చింది, మోహన్ భగవత్ పై ఒవైసీ విమర్శలు

హిందువులు, ముస్లింలు వేర్వేరు కాదని.. భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటే అని, ముస్లిం సమాజానికి హిందుత్వ వ్యతిరేకంగా కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు.

Asaduddin Owaisi : ముస్లిం సమాజంపై ద్వేష భావం హిందుత్వ నుంచే వచ్చింది, మోహన్ భగవత్ పై ఒవైసీ విమర్శలు

Asaduddin Owaisi

Asaduddin Owaisi : హిందువులు, ముస్లింలు వేర్వేరు కాదని.. భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటే అని, ముస్లిం సమాజానికి హిందుత్వ వ్యతిరేకంగా కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. మోహన్ భగవత్ పై ఒవైసీ మండిపడ్డారు. ముస్లిం సమాజంపై ద్వేషభావం హిందుత్వ నుంచి వచ్చిందని అన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న నేరస్థులకు హిందూ ప్రభుత్వ మద్దతు ఉందని ఆరోపించారు. ముస్లింలపై దాడులకు పాల్పడేవారు హిందువులు కారని మోహన్ భగవత్ అంటున్నారని… అయితే ముస్లింలకు వ్యతిరేకంగా నేరాలు చేస్తున్న వారికి అధికార పార్టీ మద్దతిస్తోందనే విషయం అందరికీ తెలుసని చెప్పారు.

గో రక్షకుల పేరుతో ఎందరో ముస్లింలపై దాడులు జరిగాయని ఒవైసీ అన్నారు. 2015లో మొహమ్మద్ అఖ్లఖ్ హత్య, 2017లో పెహ్లూ ఖాన్ పై దాడి, 2018లో అలీముద్దీన్ మృతి వంటివి ఈ దారుణాలకు కొన్ని ఉదాహరణలను చెప్పారు. అలీముద్దీన్ ను చంపిన నేరస్థులను ఒక కేంద్ర మంత్రి పూలదండలతో సత్కరించారని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు ఒవైసీ.

ఘజియాబాద్ లో జరిగిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ఇస్లాం ప్రమాదంలో చిక్కుకుందని ముస్లింలు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. హిందువులైనా, ముస్లింలైనా భారతీయుల డీఎన్ఏ ఒక్కటేనని స్పష్టం చేశారు. మతం పేరుతో దాడులు చేసే వాళ్లు హిందుత్వ వ్యతిరేకులని అన్నారు. పూజించే విధానాన్ని బట్టి ప్రజలను వేరుగా చూడలేమన్నారు. ప్రజల మధ్య ఐక్యత లేకపోతే దేశం అభివృద్ధి చెందదని భగవత్ తేల్చి చెప్పారు.