అసోంలో రెండు కొత్త భూ హక్కుల చట్టాలు

  • Published By: venkaiahnaidu ,Published On : December 22, 2019 / 12:23 PM IST
అసోంలో రెండు కొత్త భూ హక్కుల చట్టాలు

పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా అసోంలో కొన్ని రోజులనుంచి తీవ్ర ఆందోళనలు,నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో శనివారం అసోం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని స్థానిక ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే చర్యలను అస్సాం ప్రభుత్వం శనివారం ప్రకటించింది. స్థానికులకు హక్కులు ఇవ్వడం, వారి భూమిని “చొరబాటుదారులకు” విక్రయించకుండా, అస్సామీ భాష మరియు సంస్కృతిని పరిరక్షించడం వంటి కీలక నిర్ణయాల దిశగా అసోం ప్రభుత్వం ముందుకెళ్తుంది.

రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం రెండు కొత్త చట్టాలను తీసుకురాబోతుందని ఆరోగ్య మంత్రి హిమంత బిస్వా శర్మ శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు. స్థానిక ప్రజలు భూ హక్కులను పొందడం కోసం చేయబోయే చట్టం ఇందులో ఒకటని ఆయన అన్నారు. శనివారం జరిగిన క్యాబినెట్‌ మీటింగ్ లో చట్టం యొక్క రూపురేఖలు చర్చించబడ్డాయని తెలిపారు. ఆ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఒక స్థానికుడు  తన భూమిని ఒక స్థానిక వ్యక్తికి మాత్రమే అమ్మవచ్చు, మరెవరికీ కాదని ఆరోగ్య మంత్రి హిమంత బిస్వా శర్మ శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు. రెండో చట్టం…అసోంలోని వారసత్వ ప్రదేశాల చుట్టుప్రక్కల భూమిని కాపాడం కోసం ఉద్దేశించినదని ఆయన తెలిపారు.

అంతకుముందు అసోం సీఎం సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ…అసోంలో యథాపూర్వ పరిస్థితి నెలకొంటోందని, శాంతియుత వాతావరణం కనిపిస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్యంపై ప్రజలకు పరిపూర్ణ విశ్వాసం ఉందన్నారు. అసోం భూమిపుత్రుల హక్కులను ఎవరూ హరించలేరని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. అసోం ప్రజల భాష, సంస్కృతి, గుర్తింపునకు ఎలాంటి ప్రమాదమూ లేదన్నారు. ఈ విషయంలో తాను ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు.
 
అసోంలో అస్సామీ భాషే అధికార భాషగా ఉంటుందని, నిరసనలు తెలిపే అన్ని సంస్థలు, మేథావుల పట్ల తమకు గౌరవం ఉందని, అయితే కొందరు వ్యక్తులు ఇక్కడి పౌరులను తప్పుదారి పట్టిస్తున్నారని సోనోవాల్ అన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుపై అసోంలో చెలరేగిన నిరసనలు, హింసాకాండలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, హింసాత్మక ఘటనలతో ఈనెల 10న అసోంలో నిలిపివేసిన ఇంటర్నెట్ సేవలను కోర్టు ఆదేశాల తర్వాత తిరిగి శుక్రవారంనాడు పునరుద్ధరించిన విషయం తెలిసిందే.