పెట్రోల్ పై రూ. 5, లిక్కర్ పై 25 శాతం తగ్గింపు

పెట్రోల్ పై రూ. 5, లిక్కర్ పై 25 శాతం తగ్గింపు

Assam Cuts Fuel Prices : పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. దీంతో వాహనంలో ఇంధనం నింపించుకోవాలంటే భయపడుతున్నారు. ఏకంగా..వంద రూపాయల మార్క్ దాటిదంటే..పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. అనూహ్యంగా పెట్రోల్ పై రూ. 5 తగ్గిస్తూ…సంచలన నిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అంతేగాదు..మందుబాబులకు గుడ్ న్యూస్ వినిపించింది.

అసోం ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పై లీటర్ కు రూ. 5 తగ్గిస్తూ..అక్కడి బీజేపీ ప్రభుత్వం వెల్లడించింది. వాహనదారులకు భారీ ఊరటేనని చెప్పవచ్చు. మద్యంపై సుంకాన్ని 25 శాతం తగ్గించినట్లు శుక్రవారం తెలిపింది. సవరించిన రేట్లు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రి బిస్వాస్ అసెంబ్లీలో వెల్లడించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, మద్యంపై అదనపు సెస్ విధించిన సంగతి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని, రోగుల సంఖ్య బాగానే తగ్గిందని తెలిపారు.

దీంతో పెట్రోల్ పై రూ. 5 తగ్గించడం వల్ల వాహనదారులకు ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన. ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికలు మార్చి – ఏప్రిల్ నెలల్లో జరుగనున్నాయి. దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో తగ్గింపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.