ప్రభుత్వం కొత్త పథకం: పెళ్లి కూతురికి బంగారం

  • Published By: vamsi ,Published On : November 21, 2019 / 04:32 AM IST
ప్రభుత్వం కొత్త పథకం: పెళ్లి కూతురికి బంగారం

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పెళ్లి చేసుకునే అమ్మాయిలకు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ కింద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ పెళ్లి కానుక పేరుతో ప్రభుత్వాలు డబ్బులను ఇచ్చేందుకు ప్రవేశపెట్టాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా అస్సాం ప్రభుత్వం కూడా పెళ్లి చేసుకునే జంటకు బహుమతిగా ప్రభుత్వం తరపున ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రతి పెళ్లి కుమార్తెకు 10 గ్రాముల బంగారం కానుకగా అందించే పథకాన్ని ప్రకటించింది అసోం ప్రభుత్వం.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం ప్రకారం కనీసం పదవ తరగతి వరకు చదివి, ఆమె వివాహం కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ పథకం కింద అర్హులుగా గుర్తిస్తారు. ఈ పథకానికి ‘అరుంధతి బంగారు పథకం’ అనే పేరు పెట్టింది ప్రభుత్వం. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. బాల్య వివాహాలను అరికట్టడం, బాలికా విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు అసోం ఆర్థిక మంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించారు.

అస్సాంలో ఏడాదికి 3 లక్షల వివాహాలు జరిగితే 50వేల నుంచి 60వేల వరకు మాత్రమే నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో పథకం ప్రయోజనం పొందడానికి వివాహం రిజిస్ట్రేషన్ కచ్చితంగా చేయించుకుంటారని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగ ప్రభుత్వం చెబుతుంది. వధువు వార్షిక కుటుంబ ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఈ పథకం వర్తించదు. దీనివల్ల ఏటా ప్రభుత్వంపై రూ.800 కోట్ల భారం పడనుంది. ఈ పథకం అమల్లోకి వస్తే 2.5 లక్షల పెళ్లిళ్లు ఏడాదికి రిజిస్టర్ అవుతాయని భావిస్తుంది ప్రభుత్వం.

బంగారం ఫిజికల్‌గా ఇవ్వాలంటే కుదరదు కాబట్టి, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వదువు బ్యాంక్ ఖాతాలో రూ. 30వేలు జమ చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతుంది. అయితే బంగారు కొనుగోలు రశీదును మాత్రం ఆమె సమర్పించవలసి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని ప్రభుత్వం చెబుతుంది. ఇంటి ఆడపిల్లకు పుట్టింటివారు పెట్టే బంగారంలా దీనిని పరిగణించాలని అంటుంది ప్రభుత్వం.