అసోంలో విజృంభిస్తోన్న ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్…..12వేల పందులను చంపాలని ఆదేశం

  • Published By: venkaiahnaidu ,Published On : September 24, 2020 / 05:06 PM IST
అసోంలో విజృంభిస్తోన్న ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్…..12వేల పందులను చంపాలని ఆదేశం

ప్రాణాంతకమైన ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ వ్యాధి ఇప్పుడు అసోంను గజగజలాడిస్తోంది. ఓ వైపు కరోనా‌తో కకావికలం అవుతుంటే ఇప్పుడు ఈ కొత్త వ్యాధి వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తోంది.. ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆగమేఘాల మీద కొన్ని చర్యలు చేపట్టింది.


ప్రాణాంతకమైన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఏరియాల్లో దాదాపు 12 వేల పందులను నరికివేయాలని అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ బుధవారం ఆదేశించారు. అంతేకాకుండా, ఆ పందుల యజమానులు నష్టపోకుండా ఉండేందుకు వారికి తగిన విధంగా పరిహారం చెల్లించాలని అధికారులను కోరారు.


ఇప్పటికే అసోంలోని 14 జిల్లాల్లో 18,000 పందులు ఈ వ్యాధి కారణంగా చనిపోయాయని పశుసంవర్ధక, పశువైద్య శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు . ఇక మిగిలిన పందులను కూడా వధించాలనే నిర్ణయం తీసుకుంది.. రానున్న నవరాత్రి ఉత్సవాలకు ముందే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అసోం సీఎం అధికారులను ఆదేశించారు. అదే విధంగా వెంటనే శానిటైజేషన్ కార్యక్రమాలు చేపట్టాలని పశుసంవర్ధక, పశువైద్య విభాగాన్ని ఆదేశించారు.


14 బాధిత జిల్లాల్లోని 30 ఎపిసెంటర్స్ కి ఒక కిలోమీటర్ పరిధిలో తాజా పందులను చంపే డ్రైవ్ నిర్వహిస్తామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, 2019 లెక్కల ప్రకారం అసోంలో పందుల సంఖ్య 21 లక్షలుగా ఉంది. రెండుమూడేళ్లలో ఈ సంఖ్య మరింత పెరిగి 30 లక్షలకు చేరినట్లు వ్యవసాయశాఖ మంత్రి అతుల్ బోర తెలిపారు. .