Assam’s Veerappan : అసోం వీరప్పన్ ని చంపేసిన సొంత ముఠా సభ్యులు

అసోం వీరప్పన్‌గా పేరుపొందిన యునైటెడ్ పీపుల్స్ రివల్యూషనరీ ఫ్రంట్ (UPRF) చీఫ్ కమాండర్ మంగిన్ ఖల్‌హౌ హతమయ్యాడు.

Assam’s Veerappan : అసోం వీరప్పన్ ని చంపేసిన సొంత ముఠా సభ్యులు

Uprf

Assam’s Veerappan అసోం వీరప్పన్‌గా పేరుపొందిన యునైటెడ్ పీపుల్స్ రివల్యూషనరీ ఫ్రంట్ (UPRF) చీఫ్ కమాండర్ మంగిన్ ఖల్‌హౌ హతమయ్యాడు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న మంగిన్ ఖల్‌హౌని అంతర్గత విభేదాల కారణంగా యూపీఆర్‌ఎఫ్ సభ్యులే ఆదివారం హత్య చేసినట్లు స్థానిక పోలీసు వర్గాలు తెలిపాయి.పోలీసులతో సరిగ్గా పోరాడలేకపోతున్నాడని గ్రూప్ లోని యువ సభ్యులే తమ నాయకుడైన మంగిన్ ను కాల్చి చంపినట్టు పోలీసులు తెలిపారు.

మంగిన్ ఖల్‌హౌ..వీరప్పన్ లానే గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేసేవాడని, UPRF ని ఏర్పాటు చేసి తనను తాను కమాండర్ గా చెప్పుకొనే వాడని పోలీసులు తెలిపారు. వాస్తవానికి వారితో జరుగుతున్న ఎన్ కౌంటర్ లలో ఇప్పటికే ఆ గ్రూప్ కు చెందిన సీనియర్ లీడర్లందరూ చనిపోయారు. మరికొందరు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మిగతా వాళ్లూ లొంగిపోయేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా అవి వాయిదా పడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం మంగి ఖల్‌హౌ ఒక్కడే ఆ గ్రూపులో సీనియర్ సభ్యుడు. కొంతకాలంగా గ్రూపులోని ఇతర సభ్యులకు,మంగిన్ ఖల్‌హౌకు మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే శనివారం అర్థరాత్రి దాటాక అసోంలోని కార్బి ఆంగ్లాంగ్ జిల్లాలోని బోకజన్ పట్టణానికి సమీపంలోని ఖెంగ్పిబంగ్ కొండల్లో గ్రూపు మధ్య అంతర్గత గొడవలు జరిగాయి. ఈ సమయంలో మంగిన్ ఖల్‌హౌపై వారు కాల్పులకు పాల్పడ్డారు. అతని తలలో బుల్లెట్లు కురిపించారు. దీంతో మంగిన్ ఖల్‌హౌ అక్కడికక్కడే మృతి చెందాడు. మంగిన్ శరీరం మొత్తం తూటాలతో తూట్లు పడిపోయిందని, ఆదివారం ఉదయం అతడి మృతదేహాన్ని గుర్తించామని పోలీసులు చెప్పారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దిఫు హాస్పిటల్ కి తరలించారు. అయితే పోలీసులతో సరిగ్గా పోరాడలేకపోతున్నాడని.. గ్రూప్ లోని యువ సభ్యులే తమ నాయకుడైన మంగిన్ ను కాల్చి చంపినట్టు పోలీసులు చెబుతున్నారు.

కాగా, యూపీఆర్ఎఫ్‌లో దాదాపుగా కుకీ కమ్యూనిటీ నుంచి వచ్చినవారే ఉంటారు. ఈ గ్రూప్ సింగ్‌ హసన్‌ పర్వతాలపై తమ స్థావరాల్ని ఏర్పరుచుకుంది. చైనాలోని యునాన్ ప్రావిన్స్ నుంచి మయన్మార్ ద్వారా ఆయుధాలను కొనుగోలు చేసే ఈ సంస్థ గతంలో పలుమార్లు భద్రతా దళాలపై కాల్పులకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. గత ఏడాది అక్టోబర్ లో ఈ గ్రూప్ చీఫ్ కమాండర్ గయిటె పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. ఆ తర్వాత ఆ గ్రూప్ సభ్యులంతా లొంగిపోవాలని నిర్ణయించుకుని అప్పటి సీఎం శర్బానంద సోనోవాల్‌కి లేఖ కూడా రాశారు. కానీ కొన్ని కారణాలతో ఇప్పటివరకూ యూపీఆర్ఎఫ్ గ్రూప్ లొంగుబాటు జరగలేదు. అయితే గత ఏడాది కాలంలో చాలామంది గ్రూప్ సభ్యులు లొంగిపోయారు. తాజాగా మంగిన్ ఖల్‌హౌ హతమవడంతో ఆ పార్టీలో ఇక సీనియర్లు ఎవ్వరూ మిగల్లేదు.