Times Now C-Voter ఒపీనియన్ పోల్ : బెంగాల్ దీదీదే..కేరళలో విజయన్ దే విజయం..తమిళనాడులో డీఎంకే

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పాలక పార్టీలు అధికారాన్ని నిలబెట్టుకుంటాయా? లేక విపక్షాలు విజయం సాధిస్తాయా అన్నది చర్చ జరుగుతోంది. అయితే తాజాగా టైమ్స్ నౌ – సీ ఓటర్ సంస్థ తాము నిర్వహించిన ఒపీనియన్‌ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించింది.

Times Now C-Voter ఒపీనియన్ పోల్ : బెంగాల్ దీదీదే..కేరళలో విజయన్ దే విజయం..తమిళనాడులో డీఎంకే

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పాలక పార్టీలు అధికారాన్ని నిలబెట్టుకుంటాయా? లేక విపక్షాలు విజయం సాధిస్తాయా అన్నది చర్చ జరుగుతోంది. అయితే తాజాగా టైమ్స్ నౌ – సీ ఓటర్ సంస్థ తాము నిర్వహించిన ఒపీనియన్‌ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించింది.

బెంగాల్ మమతదే
టైమ్స్‌ నౌ-సీ ఓటర్‌ సర్వే ఫలితాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌-బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉంది. అయితే ఈ హోరాహోరీలో అధికార తృణముల్ కాంగ్రెస్ కొద్దిపాటి ఆధిక్యంతో అధికారాన్ని నిలబెట్టుకుంటుంది. టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే నివేదిక చెబుతోంది. తృణమూల్‌ గెలుపు అంత సులభమేమీ కాదని…అతి‌ కష్టం మీద మమత బెనర్జీ గట్టెక్కుతారని సర్వే ఫలితాలు అంచనా వేశాయి. 2016 ఎన్నికలతో పోలిస్తే ఈసారి తృణమూల్ సీట్లలో భారీగా కోత పడుతుందని సర్వే తెలిపింది. గత ఎన్నికల్లో మూడు స్థానాల్లోనే గెలిచిన బీజేపీ.. ఈసారి 107 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. గత ఎన్నికల్లో 76 స్థానాల్లో గెలిచిన లెఫ్ట్ ఫ్రంట్ (కమ్యూనిస్టులు-కాంగ్రెస్‌ కూటమి) ఈసారి కేవలం 33 స్థానాలకే పరిమితం కానుందని సర్వే స్పష్టం చేసింది. ఇక్కడ ఇతరుల పెద్దగా ప్రభావం పెద్దగా ఉండదని పేర్కొంది. మార్చి-27 నుంచి ఏప్రిల్-29వరకు ఎనిమిది దశల్లో బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

కేరళ లో విజయన్ దే విజయం
కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. మొత్తం 140 సీట్లున్న కేరళ అసెంబ్లీకి 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 91 స్థానాల్లో గెలుపొందిన ఎల్డీఎఫ్‌ కూటమి.. ఈసారి 82సీట్లు సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇక, 2016 ఎన్నికల్లో 47 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమి ఈసారి కొద్దిమేరకు పుంజుకొని 56 సీట్లను సాధించే అవకాశం ఉన్నట్టు తెలిపింది. కేరళలో సీఎం అభ్యర్థిని సైతం ప్రకటించిన బీజేపీ పరిస్థితి ఏ మాత్రం మెరుగు పడదని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే అంఛనా వేస్తోంది. గతంలో గెలిచిన ఒక్క స్థానానికే బీజేపీ పరిమితమవుతుందని సర్వే పేర్కొంది. ఏప్రిల్-6న ఒకే దశలో కేరళ ఎన్నికలు జరగనున్నాయి. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

అసోంలో తీవ్ర పోటీ
అసోం ఎన్నికల్లో ఎన్డీయే-యూపీఏ కూటమి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఎన్నికలు జరుగుతున్నాయని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే తెలిపింది. అయితే, మొత్తం 126 స్థానాలున్న అసోం అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 67 స్థానాలు గెలుచుకొని మరోసారి అధికారం నిలబెట్టుకుంటుందని పేర్కొంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏకు 57 సీట్లు వస్తాయని అంచనా వేసింది. 2016 ఎన్నికల్లో 86 సీట్లు గెలుచుకున్న ఎన్డీయే బలం ఈసారి 67కి పడిపోతుందని అంఛనా వేశారు. 2016 ఎన్నికల్లో 26 సీట్లలో గెలిచిన యూపీఏ ఈసారి భారీగా పుంజుకొని 57 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. మార్చి-27నుంచి ఏప్రిల్-6వరకు మూడు దశల్లో అసోం ఎన్నికలు జరగనున్నాయి. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

తమిళనాడు

తమిళనాడు రాజకీయాల్లో ప్రజలు స్పష్టమైన మార్పును కోరుకుంటున్నట్లు టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే తేల్చింది. ఇక్కడ స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని తెలిపింది. గత ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్‌ కూటమికి 98 సీట్లు రాగా.. ఈసారి 158 స్థానాల్లో విజయదుందుభి మోగించడం ఖాయమని తెలిపింది. అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి పట్టుమని 65 స్థానాలు రావడం కూడా కష్టమే అని సర్వే పేర్కొంది. ఏప్రిల్-6న ఒకే దశలో తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

పుదుచ్చేరి

30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో ఈసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే తెలిపింది. ఎన్డీఏకు 18 సీట్లు వస్తుండగా.. కాంగ్రెస్‌-డీఎంకే నేతృత్వంలోని యూపీఏకు 12 స్థానాలు లభించే అవకాశాలు ఉన్నాయని సర్వే వెల్లడించింది. ఇక్కడ బీజేపీదే అధికారం అని తెలిపింది. ఏప్రిల్-6న ఒకే దశలో పుదుచ్చేరి ఎన్నికలు జరగనున్నాయి. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.