Delhi Railway Station : మద్యం మత్తులో నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన రైళ్లు

Delhi Railway Station : మద్యం మత్తులో నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన రైళ్లు

Delhi Railway Station

Delhi Railway Station : అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ నిర్వాకంతో గంటకు పైగా రైళ్లు నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన అనిరుద్‌ కుమార్‌ ఉత్తర్ ప్రదేశ్ లోని కాంచౌసి రైల్వేస్ లో అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం విధులకు హాజరైన అనిరుద్ ఫుటుగా మద్యం సేవించాడు. కాసేపటికి మత్తులోకి జారుకున్నాడు.

దీంతో గురువారం అర్ధరాత్రి 12.10నిllలకు సిగ్నల్స్ నిలిచిపోయాయి. అప్పటికే స్టేషన్‌కు ఫరక్కా, మగధ ఎక్స్‌ప్రెస్‌లు వచ్చి సిగ్నల్‌ కోసం ఎదురుచూస్తున్నాయి. వాటివెనకాల గూడ్స్ రైళ్లు క్యూ కట్టాయి. నార్త్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలోని ఢిల్లీ- హౌరా మధ్య ప్రయాణించాల్సిన రైళ్లు సిగ్నల్స్ లేక నిలిచిపోయాయి. ఎంతకీ రైళ్లు కదలకపోవడంతో సెంట్రల్‌ రైల్వే అధికారులు అనిరుద్‌ కుమార్‌కు ఫోన్‌ చేశారు. ఎంతకీ ఫోన్ తీయలేదు..

అర్ధరాత్రి 1 గంట సమయంలో అధికారులు పరుగుపరుగున స్టేషన్ కి వెళ్లి చూడగా అనిరుద్ అపస్మారక స్థితిలో పడివున్నాడు. పరిశీలించిన అధికారులు మద్యం సేవించినట్లు గుర్తించారు. వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేసి, పరీక్షల నిమిత్తం తుండ్లాలోని మెడికల్‌ ఎగ్జామినేషన్‌ సెంటర్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.