Atal Tunnel అతిపెద్ద సొరంగమార్గం..ఆసక్తికర విషయాలు

  • Published By: madhu ,Published On : October 3, 2020 / 07:54 AM IST
Atal Tunnel అతిపెద్ద సొరంగమార్గం..ఆసక్తికర విషయాలు

Atal Tunnel : సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను చకచకా పూర్తిచేస్తోంది. పదేళ్ల క్రితం ప్రారంభించిన అటల్ టన్నెల్‌ ప్రాజెక్ట్‌ (Atal Tunnel) ను 2020, అక్టోబర్ 03వ తేదీ శనివారం ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేయబోతున్నారు. మనాలి నుంచి లేహ్ మధ్య నిర్మించిన సొరంగ మార్గం .. సరిహద్దు ప్రాజెక్టుల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచింది.



సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తున నిర్మించిన ఓ మహాద్భుతం ఈ ప్రాజెక్టు. ప్రపంచంలో ఇంత ఎత్తున నిర్మించిన హైవే సొరంగ మార్గం ఇదొక్కటే. మనాలి నుంచి లద్ధాక్ రాజధాని లేహ్ మధ్య అన్ని కాలాల్లోనూ ప్రయాణించడానికి వీలుగా ఈ సొరంగ మార్గం నిర్మించారు.



శీతాకాలంలో లేహ్ వెళ్లే దారులన్నీంటిని మంచు కప్పేస్తుంది. దీంతో రాకపోకలు నిలిచిపోతాయి. అందుకే ఈ సుందరమైన సొరంగ మార్గానికి రూపకల్పన చేశారు. ఇందిరా గాంధీ మొదటిసారిగా ఇలాంటి ఆలోచన చేస్తే.. అటల్ బీహారీ వాజపేయి ఈ ప్రాజెక్టుకు శంకు స్థాపన చేశారు. శనివారం ప్రధాని మోదీ.. అటల్ టన్నెల్‌కి ప్రారంభోత్సవం చేయబోతున్నారు.



క్లిష్టమైన ఈ ప్రాజెక్ట్ ఎన్నో అడ్డంకులు, అవరోధాలు దాటుకుని పూర్తయ్యేందుకు దాదాపు పదేళ్లు పట్టింది. జూన్ 3, 2000ల సంవత్సరంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి సొరంగ మార్గంపై కీలక ప్రకటన చేశారు. 2002 మే 26 న మనాలి వెళ్లి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వాజపేయి 95వ జన్మదినం సందర్భంగా మోదీ ఈ ప్రాజెక్టుకు అటల్ టన్నెల్‌గా నామకరణం చేశారు. అంతకుముందు దీన్ని రోహ్‌తంగ్ టన్నెల్‌ అని పిలిచేవారు.



9.2 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం మార్గంతో.. మనాలి, లేహ్ (Manali to Lahaul) మధ్య 46 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. నాలుగు గంటల ప్రయాణ సమయం కలిసివస్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సొరంగ మార్గం నిర్మించారు. సముద్ర మట్టానికి 3వేల కిలోమీటర్ల ఎత్తులో నిర్మితమైన అటన్ టన్నెల్‌లో ప్రతీ 150 మీటర్లకు ఓ టెలీఫోన్ సౌకర్యం ఉంది.



60మీటర్లకు ఓ ఫైర్ హైడ్రాంట్‌.. ప్రతీ 500ల మీటర్లకు ఓ అత్యవసర మార్గాన్ని ఏర్పాటు చేశారు. 2.2 కిలోమీటర్లకి ఓ యూటర్న్‌.. ప్రతీ కిలోమీటర్‌కి ఎయిర్ క్వాలిటీ మానిటర్లు ఏర్పాటు చేశారు. చీమ చిటుక్కుమన్నా క్యాచ్ చేసేలా 250 మీటర్లకు సీసీ కెమెరాలను అమర్చారు. సొరంగంలో ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే సహాయం అందించేలా ఏర్పాట్లు చేశారు.



రోహ్‌తంగ్‌ (Rohtang) లో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ (Rajnath Singh). పనుల వివరాలు, ప్రత్యేకతలతో పాటు ఇతర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా టన్నెల్‌లో ప్రయాణించారు. సొరంగ మార్గం లైట్ల వెలుగుల మధ్య మెరిసిపోతూ కనిపించింది.



సొరంగ మార్గాన్ని ప్రారంభించిన తర్వాత..మోదీ.. సిసు, సోలాంగ్ వ్యాలీలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అటల్ టన్నెల్‌ ఒకెత్తయితే దీనికి అనుబంధంగా మరో మూడు సొరంగ మార్గాలు రూపుదిద్దుకోనున్నాయి. ఇందుకోసం బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయి. ఇవన్నీ పూర్తయితే మనాలి, లేహ్ మధ్య 120 కిలోమీటర్ల దూరం తగ్గిపోతుంది. లద్ధాక్, మనాలి, శ్రీనగర్‌లకు శీతాకాలం కష్టాలన్నీ పోతాయి.