Barbie Girl : పోలీసుల క్రియేటివిటీ అదుర్స్.. బార్బీ గర్ల్‌ని ఇలా వాడేశారు

ట్రాఫిక్ పోలీసులు రూటు మార్చారు. ఆకతాయిలకు తమదైన స్టైల్ లో బుద్ధి చెబుతున్నారు. వారికి అర్థమయ్యే విధంగా వారి తరహాలోనే వెళ్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు సినిమా హీరోలను, డైలాగులను, పాటలను వాడుకుంటున్నారు. తాజాగా ముంబై పోలీసులు చూసిన క్రియేటివిటీ ప్రశంసలు అందుకుంటోంది.

Barbie Girl : పోలీసుల క్రియేటివిటీ అదుర్స్.. బార్బీ గర్ల్‌ని ఇలా వాడేశారు

Barbie Girl

Barbie Girl : సరదా కోసం మనం చేసే ఒక చిన్న పొరపాటు కూడా ప్రాణాల మీదకు తెస్తుంది. జీవితం అర్థాంతరంగా ముగుస్తుంది. అందుకే నిర్లక్ష్య ధోరణి పనికిరాది. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ఇష్టం వచ్చినట్లు ప్రయోగాలు చేస్తే ప్రాణాలకే ప్రమాదం.

ఈ మధ్య యువత తీరు శ్రుతి మించింది. బైక్‌లపై ప్రమాదకర స్టంట్లు చేయడం, దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయడం. ఆ తర్వాత సవాల్ చేయడం. సోషల్‌ మీడియాలో వీరు పెట్టిన వీడియోలకు ఎక్కువ వ్యూస్‌ వస్తుండటంతో, తామేమీ తక్కువ కాదంటూ మరికొందరు పోటీపడి స్టంట్స్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఇలా ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్న వారిలో 18 నుంచి 30 ఏళ్ల వయసు యువకులే ఎక్కువ శాతం ఉంటున్నారు.

స్టంట్స్ వీడియోలను యూట్యూబ్‌ లాంటి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూ ఫాలోవర్లను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పైగా, వీరు స్టంట్లు చేసేటప్పుడు భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తలకు హెల్మెట్‌ పెట్టుకోరు. బైక్‌ సీటుపై నిలబడటం, సీటుపై వెనక్కి తిరిగి కూర్చోవడం, నడుస్తున్న బైక్‌పై నుంచి దిగడం, మళ్లీ ఎక్కడం ఇలాంటి ప్రాణాంతక స్టంట్లు ఎక్కువగా చేస్తున్నారు. ఒకవేళ పోలీసులు వీరిని పట్టుకున్నా కేవలం జరిమానా మాత్రమే విధించి వదిలేస్తున్నారు. అది కూడా ర్యాష్‌ డ్రైవింగ్, హెల్మెట్‌ లేదని కారణాలు చూపుతూ తక్కువ ఫైన్ విధిస్తున్నారు.

తాజాగా ఇద్దరు యువకులు బైక్‌పై స్టంట్‌ చేస్తున్న వీడియోను ముంబై పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ప్రాణాంతకమైన ప్రమాదాలకు దారితీసే ఇలాంటి విన్యాసాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. రహదారి భద్రత అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో పోలీసులు చేసిన పని అందరిని అట్రాక్ట్ చేస్తోంది. రహదారి భద్రతపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు వినూత్నంగా ప్రయత్నం చేశారు. 1997 హిట్ ట్రాక్ బార్బీ గర్ల్ లిరిక్స్‌ను పోలీసులు వాడుకున్నారు. దాని ద్వారా రోడ్డు భద్రతా విషయాన్ని వెల్లడించారు. ‘బార్బీ గర్ల్, ఇది నిజమైన ప్రపంచం. జీవితం ప్లాస్టిక్ కాదు, భద్రత ముఖ్యం. ముందు జాగ్రత్త తీసుకోండి, జీవితం నువ్వు సృష్టించుకున్నది’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. పోలీసుల క్రియేటివిటీకి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. సైబ‌రాబాద్ పోలీసులు వేసిన మెమీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.