భారత విమానాలపై నిషేధం ఎత్తేసిన ఆస్ట్రేలియా

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ఇండియా నుంచి విమానాల రాకపోకలపై పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

భారత విమానాలపై నిషేధం ఎత్తేసిన ఆస్ట్రేలియా

Australia

Australia భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ఇండియా నుంచి విమానాల రాకపోకలపై పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. భారత్‌ నుంచి వెళ్లే విమానాలపై ఆస్ట్రేలియా తాత్కాలికంగా విధించిన నిషేధం ఈ అర్ధ‌రాత్రితో ముగియ‌నున్న‌ది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ శుక్రవారం కీలక ప్రకటన చేశారు.

భారత్‌ నుంచి వచ్చే విమానాలపై తాత్కాలికంగా విధించిన నిషేధాన్ని ఇవాళ అర్ధరాత్రి నుంచి ఎత్తివేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ ప్రకటించారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెందిన వాణిజ్య విమాన సర్వీసులు యథావిధిగా నడుస్తాయని స్పష్టంచేశారు. అయితే, దేశ పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకొని సేవల ప్రతి సర్వీసు ప్రారంభానికి ముందు పటిష్ఠ తనిఖీ వ్యవస్థ ఉంటుందన్నారు ఆస్ట్రేలియా ప్రధాని. పూర్తి స్థాయి కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం మాత్రమే అనుమతిస్తామని వెల్లడించారు. క్వారెంటైన్‌ కేంద్రాలను దాటి ప్రజల్లోకి కరోనా వ్యాపించకుండా అడ్డుకునేందుకు తాత్కాలిక నిషేధం సహకరించిందని మోరిసన్‌ తెలిపారు. తద్వారా మూడో వేవ్‌ రాకుండా నిలువరించగలిగామని అభిప్రాయపడ్డారు.

మే- 3న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ప్రయాణాలపై నిషేధం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా చరిత్రలో తొలిసారి అక్కడి ప్రభుత్వం తమ దేశ పౌరులపై కఠిన నిబంధనలు విధించింది. భారత్‌ నుంచి తమ దేశానికి వచ్చే ఆస్ట్రేలియన్లపై తాత్కాలికంగా నిషేధం ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. కాగా, భారత విమానలపై…కెనడా, యుఎఇ, ఇండోనేషియా, హాంకాంగ్, న్యూజిలాండ్, ఒమన్, సింగపూర్, కువైట్ ప్రకటించిన విమాన నిషేధం కొనసాగుతూనే ఉంది.

కాగా, భారత్ లో ఏప్రిల్-30న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల విమానాల నిషేధాన్ని మే- 31,2021 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నిషేధం మార్చి 2020 నుండి అమలులో ఉంది. అయితే, ఈ నిషేధం అన్ని అంతర్జాతీయ కార్గో కార్యకలాపాలు మరియు ప్రత్యేకంగా డీజీసీఏ అనుమతి పొందిన విమానాలను వర్తించదు.