అయోధ్య కేసు : లాస్ట్ డే హైడ్రామా.. పుస్తకాన్ని చించేసిన లాయర్, సీజేఐ సీరియస్

  • Published By: veegamteam ,Published On : October 16, 2019 / 08:11 AM IST
అయోధ్య కేసు : లాస్ట్ డే హైడ్రామా.. పుస్తకాన్ని చించేసిన లాయర్, సీజేఐ సీరియస్

అయోధ్య కేసు విచారణలో చివరి రోజు సుప్రీంకోర్టులో హైడ్రామా చోటు చేసుకుంది. విచారణ సందర్భంగా ముస్లిం సంస్థల తరఫు లాయర్ రాజీవ్ ధావన్ ప్రవర్తించిన తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదేపదే తమను నిలదీసినట్లు ప్రవర్తించడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇలాగైతే విచారణ నుంచి వాకౌట్‌ చేస్తామని హెచ్చరించింది. రెండు రోజుల క్రితం విచారణ సమయంలోనూ ధావన్ ఇలాగే ప్రవర్తించారు. ప్రతిసారీ తమకే న్యాయమూర్తులు ప్రశ్నలు సంధిస్తున్నారని.. ఇది సరికాదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

అయోధ్య రామజన్మ స్థానం అంటూ హిందూ మహాసభ న్యాయవాది వికాస్ సింగ్ ఓ పుస్తకాన్ని కోర్టులో చూపించారు. ఆ పుస్తకాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు తరఫు లాయర్ రాజీవ్ ధావన్ చించేశారు. రాజీవ్ ధావన్ తీరుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ సీరియస్ అయ్యారు. ఇది కరెక్ట్ కాదని మండిపడ్డారు. 

హిందూ మహాసభ లాయర్ చూపిన పుస్తకంపై వివాదం నడిచింది. లాయర్ల మధ్య వాగ్వాదం జరిగింది. అయోధ్య రీవిజిటెడ్ పుస్తకాన్ని రికార్డుల్లోకి తీసుకోవాలని హిందూ మహాసభ తరఫు లాయర్ డిమాండ్ చేశారు. అయితే ఆ పుస్తకం సాక్ష్యంగా చెల్లదని ముస్లిం సంస్థల లాయర్ వాదించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే కోర్టు నుంచి వెళ్లిపోతామని సీజేఐ సీరియస్ అయ్యారు. ఇటు మధ్యవర్తుల కమిటీ కూడా సుప్రీంకోర్టుకు తమ నివేదిక సమర్పించింది. మరోవైపు ఈ కేసు నుంచి సున్నీ వక్ఫ్‌ బోర్డు తప్పుకుంటుందని ప్రచారం జరగుతోంది.

ఇవాళ్టితో సుప్రీంకోర్టులో అయోధ్య వాదనలు ముగియనున్నాయి. సాయంత్రం 5 గంటలకు విచారణ ముగుస్తుంది. నెల రోజుల్లోనే తీర్పు ఇవ్వడానికి రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఉదయం నుంచి వాడీవేడిగా వాదనలు జరుగుతున్నాయి.

నవంబర్‌ 17వ తేదీన రంజన్‌ గొగోయ్‌ పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆలోపే తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ ఆ లోపున తీర్పు రాని పక్షంలో ఈ కేసును కొత్త ధర్మాసనం ముందు తిరిగి మొదటి నుంచి విచారించాల్సి వస్తుంది. గత 39 రోజులుగా సాగుతున్న అయోధ్య కేసు విచారణను తొలుత అక్టోబర్‌ 18న ముగించాలని ధర్మాసనం భావించింది. ఆ తర్వాత గడువును అక్టోబర్‌ 17కు జరిపారు. కాగా వాదోపవాదనలను ఇవాళే ముగిస్తామని సీజేఐ తాజాగా సంకేతాలిచ్చారు. అలాగే,  బుధవారం నాడు ఇరు వర్గాల వాదనలను సాయంత్రం 5 గంటల వరకు కోర్టు వినబోతున్నట్టు కూడా ప్రకటించారు. 

అయోధ్యలోని రామజన్మభూమి దగ్గర మసీదును నిర్మించడం ద్వారా మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ ఓ చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారంటూ మహంత్‌ సురేశ్‌ దాస్‌ అనే హిందూ పిటిషనర్ తరఫు న్యాయవాది పరాశరన్‌ మంగళవారం సుప్రీంకోర్టు ఎదుట తన వాదనను వినిపించారు. అయోధ్యలో పలు మసీదులున్నాయని, అక్కడ ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చని, అయితే, హిందువులు మాత్రం శ్రీరాముడి జన్మస్థలాన్ని మార్చలేరని అన్నారు.