అయోధ్య ప్రశాంతం : కొనసాగుతున్న నిషేధాజ్ఞలు

  • Published By: madhu ,Published On : November 10, 2019 / 12:55 AM IST
అయోధ్య ప్రశాంతం : కొనసాగుతున్న నిషేధాజ్ఞలు

రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్య ఊపిరి పీల్చుకుంది. తీర్పు నేపథ్యంలో ఇంకా నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ విధించడంతో నగరమంతా నిర్మానుష్యంగా మారిపోయింది. భద్రతా చర్యల్లో భాగంగా అయోధ్య వీధుల్లో పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య కేసుపై.. సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు చెప్పేసింది. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం తీర్పు తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. అయోధ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. 144 సెక్షన్ విధించడంతో.. నగరమంతా నిర్మానుష్యంగా మారిపోయింది. ఎలాంటి హింసాత్మక ఘటనలు చెలరేగకుండా పోలీసులు బందోబస్తు కొనసాగుతోంది. డ్రోన్లు, సీసీ కెమెరాలతో.. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. 

తీర్పు వెలువడుతుందన్న అంచనాతో.. 15 రోజుల ముందే భద్రతను పెంచారు. అయోధ్య మొత్తం.. వేలల్లో పారామిలటరీ బలగాలను దించారు. అన్ని చోట్లా బాంబ్ స్క్వాడ్‌లతో.. క్షుణ్ణంగా తనీఖీలు చేశారు. బాంబ్ డిప్యూజన్ టీమ్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అయోధ్యలోనే తిష్టవేశాయి. స్థానికులను కూడా.. పూర్తిగా తనిఖీ చేశాకే.. నగరం లోపలికి అనుమతించారు. 

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో.. అయోధ్యను 31 సెక్టార్లు, 35 సబ్ సెక్టార్లుగా విభజించి బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే.. అప్పటికప్పుడు వాడుకునేందుకు.. రెండు హెలికాప్టర్లను కూడా యూపీ సర్కార్ అందుబాటులో ఉంచింది. లక్నోలో స్టేట్ లెవెల్ కమాండ్ రూమ్ ఏర్పాటు చేసి.. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందస్తు చర్యల్లో భాగంగా.. యూపీలోని విద్యాసంస్థలకు సోమవారం వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సోషల్ మీడియా అకౌంట్లపైనా.. పోలీసులు కన్నేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు, హింసను ప్రేరేపించే పోస్టులు పెట్టే వారిపై నిఘా పెట్టారు. 

మరోవైపు..తీర్పు నేపథ్యంలో రాష్ట్రాలు కూడా అలర్ట్ అయ్యాయి. కర్ణాటకలో ముందే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యలుగా ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముంబాయిలో హింసాత్మక ఘటనలు చెలరేగే అవకాశం ఉందన్న అంచనాతో.. భారీగా పారామిలిటరీ బలగాలను మోహరించారు. అయోధ్య తీర్పు వెలువడటంతో కేంద్ర హోంశాఖ సూచనల మేరకు.. రాష్ట్రాలు కూడా భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దేశవ్యాప్తంగా ఉన్న భద్రతా ఏర్పాట్లపై సమీక్ష చేశారు. ముఖ్యంగా అయోధ్య భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై.. అధికారులకు సూచనలు చేశారు. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ షా ఫోన్లో మాట్లాడారు. అల్లర్లు చెలరేగే అవకాశం ఉండటంతో.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More : అయోధ్య తీర్పుపై ఎవరేమన్నారంటే