శ్రీరాముడి కోరికను స్వీకరిస్తున్నాను : ఇక్బాల్ అన్సారీ

  • Published By: murthy ,Published On : August 4, 2020 / 06:46 AM IST
శ్రీరాముడి కోరికను స్వీకరిస్తున్నాను : ఇక్బాల్ అన్సారీ

ఆగస్టు 5 న  అయోధ్యలో జరిగే రామమందిరం భూమి పూజ కార్యక్రమానికి పిలుపులు మొదలయ్యాయి. హిందూ ముస్లింల మధ్య సోదర భావాన్ని పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొదటి ఆహ్వాన పత్రికను అయోధ్య భూ వివాద కేసులో ముస్లింల తరుఫున వాదించిన న్యాయవాదుల్లో ఒకరైన ఇక్బాల్ అన్సారీకి నిన్న అందచేశారు.



అయోధ్య భూవివాదంలో ముస్లింల తరుఫున బలంగా వాదించిన న్యాయవాదుల్లో అన్సారీ ఒకరు. ఈ సందర్భంగా ఇక్బాల్ మాట్లాడుతూ…. ఇది సాక్షాత్తూ ఆ శ్రీరామచంద్రుడి కోరిక అయ్యి ఉంటుంది. అందుకే నాకు మొదటి ఆహ్వాన పత్రిక అందింది.

నేను దీన్నిమనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అయోధ్యలో హిందూ ముస్లింలు సోదర భావంతో మెలుగుతారు అని ఆనందం వ్యక్తం చేసారు. రామ మందిరానికి సంబంధించి ఎటువంటి మతపరమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినా వెళతాను.



ఆలయం నిర్మాణం పూర్తయతే.. అయోధ్య చరిత్ర కూడా మారి పోతుంది. పట్టణం ఎంతో అందంగా తయారవుతుంది. భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఈ పట్టణాన్ని సందర్శిస్తారు. కాబట్టి స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి’ అన్నారు.

అయోధ్య ప్రజలు గంగా-జమున నాగరికతను అనుసరిస్తున్నారని, ఎవరిలోనూ చెడు భావన లేదని అన్సారీ అన్నారు‌. ‘ఈ ప్రపంచం నమ్మకం మీదనే నడుస్తోంది.ఇది సాధువుల భూమి. అయోధ్యలో ప్రతి మతానికి, వర్గానికి చెందిన దేవతలు ఉన్నారు. రామ మందిరం నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అన్నారు అన్సారీ.



దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న భూమిపూజకు ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు.

బీజేపీ సీనియర్ నేత రామ మందిరం కోసం శ్రమించిన ఎల్ కే అడ్వానీతో పాటు  పలువురు నేతలకు కూడా ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. అతిధులుగా మొదట 200 మందిని పైగా ఆహ్వానించాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రద్దీకి అవకాశం లేకుండా కేవలం 180 మంది మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు.