Ayodhya Land Deal : రామ మందిర విరాళాల్లో గోల్ మాల్!

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ​పై అవినీతి ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Ayodhya Land Deal : రామ మందిర విరాళాల్లో గోల్ మాల్!

Ayodhya

Ayodhya Land Deal అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ​పై అవినీతి ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. భూమి కొనుగోలు విషయంలో ట్రస్ట్ సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, సమాజ్​ వాదీ పార్టీ నేత పవన్ పాండే ఆదివారం తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్త చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే ట్రస్టు ఏర్పడింది కాబట్టి..ఈ సమస్యను అత్యున్నత ధర్మాసనమే పరిష్కరించాలని కాంగ్రెస్ కోరింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని పేర్కొంది. అదేవిధంగా,ప్రధాని మోదీ ఈ వ్యవహారంపై మౌనం వీడాలని పేర్కొంది.

సోమవారం ప్రియాంక గాంధీ చేసిన ఓ ట్వీట్ లో…కోట్లాది మంది భక్తులు ఎంతో నమ్మకంతో భక్తితో తమ విరాళాలను నైవేధ్యంగా రాముడి పాదాల దగ్గర ఉంచారు. అలాంటి విరాళాలను దుర్వినియోగం చేయడం అన్యాయం, పాపం. ఇది రామ భక్తుల విశ్వాసాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. స‌త్యం, న్యాయం అనేవి శ్రీరాముడికి మారుపేర‌ని రాముడి పేరుతో మోసం చేయడం అధర్మమంటూ రామ మందిర స్కామ్ హ్యాష్ ట్యాగ్ తో రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు.

అసలేంటీ ప్రస్తుత వివాదం

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం గతేడాది శ్రీరామ మందిర తీర్థ క్షేత్ర పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసింది కేంద్రం. 15 మంది సభ్యులతో కూడిన ఈ ట్రస్ట్​ కి మహంత నృత్యగోపాల్ దాస్ ఛైర్మన్​గా ఉన్నారు. మందిర నిర్మాణం సహా సంబంధిత విషయాలపై ఈ ట్రస్ట్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది. వివాదం కొనసాగిన 2.77 ఎకరాలతో పాటు మిగతా 67.703 ఎకరాల భూమిని ఈ ట్రస్ట్​కు అప్పజెప్పింది కేంద్రం.

అయితే తాజాగా అయోధ్యలోని బాగ్ జైసీ గ్రామంలో 1.208 హెక్టార్ల భూమి కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందనేది ఆప్,ఎస్పీ నేతల ఆరోపణ. రెండు కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ట్రస్ట్..రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసిందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. సుమ్‌, హరీశ్‌ పాఠక్‌ అనే వ్యక్తుల నుంచి రవి మోహన్ తివారీ, సుల్తాన్ అన్సారీ రూ. 2 కోట్ల విలువైన భూమిని సాయంత్రం 7.10 గంటలకు కొనుగోలు చేశారని.. అదే భూమిని సాయంత్రం 7.15 గంటలకు రామ జన్మభూమి ట్రస్టుకు చెందిన చంపత్ రాయ్ రూ.18.5 కోట్లకు కొన్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ. 16.5 కోట్లు అదనంగా చెల్లించినట్లు ఆరోపించారు. రెండు లావాదేవీలకు ట్రస్ట్‌ సభ్యుడు అనిల్‌ మిశ్రా, అయోధ్య మేయర్‌ రిషికేశ్‌ ఉపాధ్యాయ సాక్షులుగా వ్యవహరించారని పేర్కొన్నారు. నిమిషాల వ్యవధిలో భూమి విలువ 10 రెట్లు ఎలా పెరిగిందని ఎస్పీ నేత సంజయ్ పాండే ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని కోరారు.

విమర్శలపై స్పందించిన ట్రస్ట్

రాజకీయ దురుద్దేశాలతోనే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడు, రామ మందిర్‌ ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకే భూమిని కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు అయోధ్యకు వచ్చి భూములను కొనుగోలు చేయడంతో భూముల ధరలు పెరిగాయి. వార్తల్లో కథనాలు వచ్చిన ప్లాట్.. రైల్వే స్టేషన్​కు సమీపంలో ఉంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ఇప్పటివరకు కొనుగోలు చేసిన భూముల ధరలు ఓపెన్ మార్కెట్ రేట్లకన్నా తక్కువేనని ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

అయోధ్య మేయర్ రిషికేష్ ఉపాధ్యాయ్
రెండు లావాదేవీల్లో ఉపాధ్యాయ్ సాక్షిగా ఉన్నారు. తొలి లావాదేవీకి సంబంధించి భూమి కొనుగోలు విషయంపై రెండేళ్ల క్రితమే ప్రాపర్టీ డీలర్​తో ఒప్పందం కుదిరిందని, అది పాత రేట్ల ప్రకారం జరిగిందని చెప్పారు. ట్రస్టుకు ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం విక్రయించినట్లు తెలిపారు. ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని ఆయన తెలిపారు.