నూట ముప్పై నాలుగేళ్ల వివాదం: ఆది నుంచి అంతం వరకు.. అయోధ్య కథ ఇదే!

  • Published By: vamsi ,Published On : November 9, 2019 / 07:13 AM IST
నూట ముప్పై నాలుగేళ్ల వివాదం: ఆది నుంచి అంతం వరకు.. అయోధ్య కథ ఇదే!

దశాబ్దాలుగా దేశంలో రాజకీయ వివాదాలకు కారణంగా.. హిందూ ముస్లింల మధ్య ఐక్యతకు విఘాతంగా మారిన అయోధ్య వివాదం ఎట్టకేలకు ముగిసింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగిస్తూ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది.

అసలు శతాబ్దాల నాటి అయోధ్య వివాదం ఏమిటంటే 1528లో రామ జన్మభూమిగా హిందువులు భావించే స్థలంలో బాబ్రీ మసీదు అప్పటి మొఘల్ చక్రవర్తి బాబర్ నిర్మించారనేది ఆరోపణ. 1853లో తొలిసారి అక్కడ మతవిద్వేషాలు మొదలవగా అప్పుడు గొడవలు జరిగాయి. 1859లో ఆ ప్రాంతంలో ఫెన్సింగ్ నిర్మించి.. హిందువులు, ముస్లింలకు వేర్వేరుగా అనుమతి కల్పించారు. 1949లో మసీదు వద్ద సీతారాముల విగ్రహాలను పెట్టారు. అప్పుడు దానిని వివాదాస్పద భూమిగా ప్రభుత్వం ప్రకటించింది.

అనంతరం 1984 అయోధ్యలో రామమందిరం నిర్మించాలని కొన్ని హిందూసంఘాలు కమిటీగా ఏర్పడి డిమాండ్ చేశాయి. 1986లో హిందువులు ప్రార్థన చేసుకోవడానికి కోర్టు అనుమతి లభించింది. దీనిపై బాబ్రీ మసీదు ముస్లిం యాక్షన్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే 1989లో బాబ్రీ మసీదు దగ్గర రామమందిరం నిర్మాణానికి వీహెచ్‌పీ పునాదిరాయి వేసింది. 

ఈ క్రమంలోనే 1990లో అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎల్‌కే అద్వానీ రామ రథయాత్ర చేశారు. 1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చేయగా దేశవ్యాప్తంగా మతకల్లోలాలు జరిగాయి. మతకల్లోలాలు 2వేల మంది వరకు చనిపోయారు. దీంతో 1992 ద లిబర్హన్ కమిషన్ ఏర్పాటైంది. 2010లో వివాదాస్పద భూమిని కక్షిదారులు పంచుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును 2011లో సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది.

అనంతరం 2017లో అయోధ్య వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకునేందుకు సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది. 2019 మార్చిలో మధ్యవర్తుల కమిటీని కూడా సుప్రీంకోర్టు నియమించింది. కానీ అందువల్ల ప్రయోజనం ఏం జరగలేదు. దీంతో 2019 ఆగస్ట్‌లో సుప్రీంకోర్టు ఈ వివాదంపై రోజువారీ విచారణను ప్రారంభించింది.

అయోధ్య కేసుపై దాదాపు 40 రోజులపాటూ విచారించిన సుప్రీంకోర్టు, అక్టోబర్ 16న తీర్పును రిజర్వులో పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శాంతి భద్రతలకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాయి. అంతా కంట్రోల్‌లో ఉందని క్లారిటీ వచ్చాక సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో 134 ఏళ్లుగా వివాదంలో ఉన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం ముగిసిపోయింది.