ఆయుష్ డాక్టర్లు కరోనా మందులు సూచించొద్దు…సుప్రీంకోర్టు

ఆయుష్ డాక్టర్లు కరోనా మందులు సూచించొద్దు…సుప్రీంకోర్టు

Ayush Doctors Can’t Prescribe Covid Medicines ఆయుష్‌, హోమియోపతి డాక్టర్లు ప్రాణాంతకమైన కరోనావైరస్ ట్రీట్మెంట్ కి మందులు సూచించడం గానీ లేదా వాటిని ప్రచారం(prescribe or advertise)చేయడం గానీ చేయకూడదని మంగళవారం(డిసెంబర్-15,2020)సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటువంటి ప్రిస్క్రిప్షన్లను నిషేధిస్తూ ఆగస్టు-21న కేరళ హైకోర్టు వెలువరించిన తీర్పుకు వ్యతిరేకంగా డాక్టర్‌ ఏకేబీ సద్భావనా మిషన్‌ స్కూల్‌ ఆఫ్‌ హోమియోపతి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ మేరకు కోర్టు స్పందించింది.

హోమియోప‌తి,ఆయుర్వేద‌,సిద్ధ‌,యునాని వంటి వైద్య విధానాలు పాటించేవారు కోవిడ్‌-19 కోసం ఇమ్యూనిటీని పెంచే మందుల‌ను మాత్ర‌మే ఇవ్వాలంటూ కేర‌ళ హైకోర్టు త‌న తీర్పులో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పును సుప్రీంకోర్టు ఇవాళ స‌మ‌ర్థించింది. కేరళ హైకోర్టు ఉత్తర్వులను సవరించేందుకు నిరాకరిస్తూ జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇవాళ ఈ తీర్పును వెలువరించింది. కొవిడ్‌-19 నేపథ్యంలో కోవిడ్‌ కు వ్య‌తిరేకంగా ఇమ్యూనిటీని పెంచే ప్ర‌భుత్వ ఆమోదిత మందుల‌ను మాత్ర‌మే అర్హులైన ఆయుష్,హోమియోపతి డాక్ట‌ర్లు సూచించాల‌ని సుప్రీంకోర్టు త‌న తీర్పులో తెలిపింది.

కాగా, కోవిడ్‌ చికిత్సలో భాగంగా ఆయుర్వేదాన్ని ఉపయోగించేందుకు అక్టోబర్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ ఒక ప్రొటోకాల్‌ను విడుదల చేశారు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. వాటిలోని శాస్త్రీయతను ప్రశ్నిస్తూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆయనకు ఒక లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే.

మరోవైపు,కరోనా నేపథ్యంలో 8 నెలలుగా ప్రత్యేక విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు విరామం ఇచ్చే విషయాన్ని పరిగణించాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. విశ్రాంతి లేకుండా నిరంతరంగా పనిచేయడం వల్ల వారి మానసిక స్థితి దెబ్బతినే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు అందిస్తున్న ట్రీట్మెంట్ పై విచారిస్తున్న క్రమంలో జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌‌, జస్టిస్‌ ఆర్‌ఎస్​ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కోర్టు సూచనను కేంద్ర ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనానికి హామీ ఇచ్చారు.